Sensational Judgement | రాష్ట్ర‌ప‌తికే సుప్రీంకోర్టు షాక్… మూడు నెల‌ల్లోపే బిల్లులు ఆమోదించాల‌ని ఆదేశం ..

న్యూ ఢిల్లీ ‍: ‍‍రాష్ట్రాల గవర్నర్‌లు రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే బిల్లులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్‌లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కాగా రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ తరహా తీర్పు చెప్పడం ఇదే తొలిసారి. రాష్ట్ర‌ప‌తి వ‌ద్ద గ‌వ‌ర్న‌ర్ లు పంపిన బిల్లులు నెల‌లు త‌ర‌బ‌డి పెండింగ్ లో ఉండ‌టంపై నేడు స్పందించింది. గ‌వ‌ర్న‌ర్ పై ఏ బిల్లునైనా మూడు నెల‌లో ఆమోదించ‌డమో, తిర‌స్క‌రించ‌డ‌మో చేయాల‌ని రాష్ట్ర‌ప‌తి కి సూచించింది. తమిళనాడు రాష్ట్రం vs తమిళనాడు గవర్నర్’ కేసులో ఇచ్చిన మైలురాయి తీర్పులో, సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి వ్యవహరించాల్సిన కాలపరిమితిని కూడా నిర్దేశించింది.

ఇదిలావుంటే తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికుమార్‌ తొక్కిపెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఏదైనా బిల్లును మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సివస్తే అందుకు గవర్నర్‌ తీసుకోదగిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని సంచలనాత్మక తీర్పు చెప్పింది. శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్‌ చర్యలు తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం కూడా ఇదే ప్రథమం.

ఒకవేళ మంత్రిమండలి సలహా లేకుండా గవర్నర్‌ బిల్లు ఆమోదాన్ని నిలిపి ఉంచాలని భావిస్తే మూడు నెలల్లోగా ఆ బిల్లును శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది. గవర్నర్‌ ఈ కాల నిర్దేశాన్ని పాటించకపోతే ఆయన చర్యపై కోర్టులు న్యాయసమీక్ష జరపవచ్చని పేర్కొంది. మంత్రిమండలి సలహా మేరకు పనిచేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణాధికారాలేవీ లేవని, రాజ్యాంగంలోని 200వ అధికరణం కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేస్తోందని తెలిపింది. రెండోసారి సమర్పించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేసి ఉంచే అధికారం గవర్నర్‌కు లేదని వ్యాఖ్యానించింది.

ఇదే విధంగా రిజర్వ్ చేయబడిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని కోర్టు పేర్కొంది. తీర్పులో, ఆర్టికల్ 200 కింద బిల్లులపై గవర్నర్ చర్యలకు కూడా కోర్టు కాలపరిమితిని నిర్దేశించింది. దీర్ఘ‌కాలం గ‌వ‌ర్న‌ర్ ఏ బిల్లును పెండింగ్ లో ఉంచ‌రాద‌ని ఇప్ప‌టికే ఇచ్చిన తీర్పులో పేర్కొంది.. గ‌డువు దాటిని బిల్లుల‌ను గ‌వ‌ర్న‌ర్ ఆమోదించ‌క‌పోయినా, తిప్పి పంప‌క‌పోయినా ఆ బిల్లులు ఆమోదం పొందాయ‌నే భావించాల్సి ఉంటుంద‌ని గ‌వ‌ర్న‌ర్ కు సూచించింది. ఇదే విధ‌మైన ప‌ద్ద‌తి రాష్ట్రప‌తికి సైతం వ‌ర్తిస్తుంద‌ని నేడు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో పేర్కొంది..

Leave a Reply