నాణ్యమైన పత్తి విక్రయించి మద్దతు ధర పొందండి
ఊట్కూర్, అక్టోబర్ 24 (ఆంధ్రప్రభ) రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని నారాయణపేట ఎమ్మెల్యేడాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని తిప్రాస్ పల్లి విజయ కాటన్ మిల్లులో పూజలు నిర్వహించి సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతులు పండించిన పత్తి పంటను ఎండబెట్టి తేమ 8 నుండి 12 శాతం మధ్యలో ఉన్న పత్తి తీసుకురావాలన్నారు. రైతులు నాణ్యమైన పత్తి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.
రైతులు కపాస్ కిసాన్ యాప్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం రైతులకు సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద పత్తి విక్రయిస్తే క్వింటాలుకు రూ. 8110 కనీస మద్దతు ధర చెల్లిస్తుందని అన్నారు. ప్రభుత్వం నిర్వహించిన సిసిఐ కొనుగోలు కేంద్రంలో రైతులకు అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూ పత్తి విక్రయించిన రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు జమ చేసే విధంగా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, కార్యదర్శి భారతి, పత్తి మిల్లు యజమాని కిషోర్ జైన్ సిసిఐసిపిఓ అనిల్, సూపర్వైజర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

