కళా సాంస్కృతిక రంగాల నిపుణులతో సెలక్షన్ కమిటీ

  • నాద నీరాజనం కార్యక్రమం కోసం కళాబృందాల ఎంపిక ప్రక్రియ ప్రారంభం
  • దరఖాస్తులు, వీడియో ప్రదర్శనల ఆధారంగా ప్రతిభ పరిశీలన

తిరుపతి సిటీ, ఆంధ్రప్రభ: కళా సాంస్కృతిక రంగాల్లో నిపుణులతో కూడిన సెలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించినట్లు టీటీడీ ఎస్వీబీసీ భక్తి ఛానల్ చైర్మన్ బి. శ్రీధర్ వర్మ తెలిపారు. ఎస్వీబీసీ కార్యాలయంలో నాద నీరాజనం కళాబృందాల ఎంపిక కమిటీ సమావేశం నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ.. నాద నీరాజనం కార్యక్రమం కోసం ఎస్వీబీసీకి వచ్చిన దరఖాస్తులను కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. కళాబృందాలు పంపిన వీడియోలను వీక్షించి వారి ప్రతిభ, ప్రదర్శన స్థాయి, కార్యక్రమానికి అనుకూలత వంటి అంశాలను పరిశీలించి ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్లు చెప్పారు.

అక్టోబర్, నవంబర్ నెలల్లో నాద నీరాజనం కార్యక్రమంలో ప్రదర్శనలు ఇవ్వనున్న కళాబృందాలను సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుందని తెలిపారు. కళాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, వివిధ విభాగాల మధ్య సమన్వయం వంటి అంశాలపై సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు.

నాద నీరాజనం కళాబృందాల ఎంపిక కమిటీలో ఎస్వీబీసీ చైర్మన్ బి. శ్రీధర్ వర్మతో పాటు పద్మశ్రీ కన్యాకుమారి అవసరాల (వయోలిన్ విద్వాంసురాలు, చెన్నై), పద్మశ్రీ ఆనంద శంకర్ జయంత్ (భరతనాట్యం కళాకారిణి, హైదరాబాద్), వేదాంతం రాధేశ్యామ్ (కూచిపూడి కళాకారుడు), ముడిగొండన్ ఎస్.ఎన్. రమేష్ (వీణ విద్వాంసుడు, చెన్నై), పండిట్ కైవల్య కుమార్ గురవ్ (హిందుస్తానీ శాస్త్రీయ గాయకుడు, ధార్వాడ్), నందకిశోర్ కపోటే (కథక్ కళాకారుడు, పుణే), ఎస్‌వీ మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్, ఎస్వీబీసీ కన్వీనర్ సభ్యులుగా ఉన్నారు.

సమావేశం అనంతరం వివిధ కళారంగాల్లో నిపుణులైన సెలక్షన్ కమిటీ సభ్యులను ఎస్వీబీసీ చైర్మన్ బి. శ్రీధర్ వర్మ శాలువాలతో ఘనంగా సత్కరించారు. కళా, సాంస్కృతిక కార్యక్రమాల అభివృద్ధికి ఎస్వీబీసీ నాద నీరాజనం వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.