రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు ఎంపిక..
కుబీర్, ఆంధ్రప్రభ : కుబీర్ మండలం నిగ్వ గ్రామానికి చెందిన సరికొండ లావణ్య–అనిల్ దంపతుల కుమారుడు సరికొండ వరుణ్ రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి కుస్తీ పోటీల్లో వరుణ్ అద్భుత ప్రతిభ కనబరిచి ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు.
జిల్లా స్థాయి పోటీల్లో ప్రత్యర్థులపై పైచేయి సాధించి సత్తా చాటిన వరుణ్ ఇప్పుడు రాష్ట్ర స్థాయి పోటీల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. భైంసా పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న వరుణ్.. చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తుండటంపై నిగ్వ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చదువును, క్రీడలను సమతుల్యంగా కొనసాగిస్తూ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం తమ గ్రామానికి గర్వకారణమని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయి పోటీలు తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని తెలిపాడు.
రాబోయే రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లోనూ పట్టుదలతో రాణించి గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యమని ధీమా వ్యక్తం చేశాడు. తన గ్రామానికి, కుబీర్ మండలానికి మంచి పేరు తీసుకురావడానికి కష్టపడతానని పేర్కొన్నాడు. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ వరుణ్ విజయం సాధించి బంగారు పతకంతో తిరిగి రావాలని గ్రామస్థులు, క్రీడాభిమానులు ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
