- వరద ముంపు ముప్పుపై ఫోకస్
- డ్రైన్ డక్ట్,నాలాలు,డ్రైన్స్ విస్తరించాలి
- హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్ల రివ్యూ
- కుడా ఆఫీస్ లో అధికారు లందరితో వరద ముంపుపై చర్చ
వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ నగరానికి వరద ముంపు ముప్పు నుండి తప్పించేందుకు శాశ్వతమైన పరిష్కారానికి సమగ్ర ప్రణాళికలను అధికారులు సమన్వయంతో రూపొందించాలని వరంగల్, హనుమకొండ,జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను ఆదేశించారు.
మంగళవారం హనుమకొండ లోని కుడా కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలోని వరద ముంపు బారీ నుండి నగరాన్ని రక్షించేందుకు మున్సిపల్, రెవెన్యూ, సాగునీటి పారుదల, రెవెన్యూ, కుడా ఇతర శాఖల అధికారులతో గ్రేటర్ కమిషనర్ లు రూపొందించాల్సిన సమగ్ర ప్రణాళికపై ఇద్దరు కలెక్టర్లు సమీక్షించారు.
నగరం లోనికి ప్రధానంగా వరద నీరు ఏయే ఎగువ ప్రాంతాల నుండి వస్తోంది, ఉన్న నాలాలు, వాటి సామర్థ్యం, కచ్చా నాలాలు, గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో ఉన్న చెరువులు, ముంపు కాలనీలు, డ్రైన్ డక్టులు, ప్రస్తుతం చెరువుల పరిస్థితి, ఆక్రమణలు, నగరం నుండి వరద నీటిని సురక్షితంగా బయటకు పంపేందుకు ఉన్న మార్గాలు, ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో, డ్రైన్ డక్టుల నిర్మాణం, నాలాలు, డ్రైనేజీల విస్తరణ, నిర్మాణ వ్యయం తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారదలు మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ నగరంలో భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా వరద ముంపు నుండి తప్పించేందుకు శాశ్వత సమగ్ర ప్రణాళిక ను రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని గుర్తు చేశారు, ఈ మేరకు నిపుణుల సలహాల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ వరద ముంపు శాశ్వత నివారణకు పటిష్టమైన ప్రణాళిక తయారు చేయాలన్నారు. వరద నీరు కాలనీల నుండి నేరుగా బయటికి వెళ్లే విధంగా ప్రణాళిక ఉండాలన్నారు.
ఈ సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాలో అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి, మున్సిపల్, ఇరిగేషన్ ఎస్ఈ లు సత్యనారాయణ, రాంప్రసాద్, కుడా సీపీవొ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, హనుమకొండ, వరంగల్ ఆర్డీవో లు రాథోడ్ రమేష్, సుమ, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

