Sarpanch | గ్రామ సేవాకురాలిగా పనిచేస్తా
- పెద్దపోర్ల సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి కాశమ్మ
Sarpanch | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఓటర్లు సర్పంచ్ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపిస్తే.. పెద్దపోర్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సేవకురాలిగా పనిచేసి ప్రజల రుణం తీర్చుకుంటానని సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి బోయినపల్లి కాశమ్మ అన్నారు. ఇవాళ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల గ్రామంలో వార్డు అభ్యర్థులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… విద్యావంతులైన తన కుమారుల సహకారంతో గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని మహిళగా ఆదరించి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా గ్రామ అభివృద్ధికి నోచుకోలేదని, మహిళగా ఆదరిస్తే గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడంతో పాటు బస్సు సౌకర్యం కల్పిస్తానన్నారు. చెరువు కట్ట వద్ద వాహనాలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందిగా ఉందని గెలిపిస్తే వెంటనే సమస్య పరిష్కరిస్తానన్నారు.
గ్రామ అభివృద్ధికి నిస్వార్ధంగా సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందిస్తానన్నారు. ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే పెద్దపోర్ల రూపురేఖలు మారుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవి కుమార్, మాజీ ఎంపిటిసి శివ, తదితరులు పాల్గొన్నారు.

