తేలేది నేడే!
అఫ్గానిస్తాన్, పాక్ మధ్య నేడు శాంతి చర్చలు
ఇంటర్నేషనల్ వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : పాకిస్తాన్ మరో యుద్ధాని సిద్ధపడుతుందా? పొరుగు రాష్ట్రమైన అఫ్గానిస్తాన్‌తో ఢీకొడుతుందా? అనేది ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ రోజు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించుకునేందుకు శాంతి చర్చలు జరుగునున్నాయి. చర్చలు ప్రారంభానికి ముందే పాకిస్తాన్ (Pakistan) రక్షణమంత్రి (Defence minister) ఖవాజా ఆసిఫ్ (Khawaza Asif), అఫ్గానిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సంగతి విదితమే. చర్చలు ఫలించకపోతే యుద్ధమే అంటూ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. ఇంకా చర్చలు ప్రారంభం కాకముందే పాకిస్తాన్ వార్నింగ్ ఇచ్చిందంటే మరో యుద్ధానికి సిద్ధపడినట్లు అని అర్ధం చేసుకోవచ్చు.
ఈ రోజు మూడోసారి చర్చలు
పాకిస్తాన్, అఫ్గాన్‌స్తాన్ మధ్య రెండు సార్లు జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. మూడో సారి శాంతి చర్చలు ఈ రోజు జరుగునున్నాయి. ఈ శాంతి చర్చలకు ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా మూడోవిడత శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ రోజు జరగబోయే చర్చలపై పలు దేశాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. యుద్ధం జరిగితే పరిణామాలు అన్ని దేశాలకు తెలుసు. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్, అప్గాన్‌స్తాన్‌లో యుద్ధం రాకుండా నివారించుకోవడమే మంచిదని పలు దేశాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇదీ పాకిస్తాన్ మాట…
ఈ రోజు జరగనున్న శాంతి చర్చలు విఫలమైతే ఇరుదేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయని పాకిస్తాన్ చెబుతోంది. ‘మా వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయి. శత్రువులు మమ్మల్ని ఎలా టార్గెట్ చేస్తారన్న దాన్ని బట్టి మా ప్రతిస్పందన కూడా తీవ్రస్థాయిలో ఉంటుంది. చర్చలు ఫలించకపోతే యుద్ధం జరిగి తీరుతుంది’ అని ఆ దేశం ఒక హెచ్చరికా జారీ చేసింది. మిలిటెంట్లకు కాబూల్ ఆశ్రయం కల్పిస్తోందని, సీమాంతర దాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించింది.
ఇదీ అప్గానిస్తాన్ మాట..
పాకిస్తాన్ వ్యాఖ్యలను అఫ్గానిస్తాన్ తీవ్రంగా ఖండించింది. సామాన్యులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోందని మండిపడింది. అఫ్గాన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటున్న తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) ఉగ్రవాదులు.. పాక్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఓరక్‌జాయ్ జిల్లాలో ఇటీవల దాడులు చేశారు. ఈ దాడుల్లో లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ సహా 11 మంది సైనికులు మరణించారు. ఈ క్రమంలోనే కాబుల్‌లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లకు పాకిస్తాన్ కారణమని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ క్రమంలోనే తాలిబన్ సైన్యం పాకిస్థాన్‌పై దాడులకు దిగిందని ప్రకటించింది. దీంతో పాకిస్తాన్ ఎదురుదాడులు జరిపింది. ఈ ఘర్షణల్లో ఇరువైపులా భారీ ప్రాణనష్టం జరిగింది. అప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

