Sangareddy – Kandi | భార్యాభర్తలు దుర్మరణం!

డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడిన కారు.. ఘటనాస్థలంలోనే ఇద్దరి మృతి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి మండలం కంది గ్రామ పరిధిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఫోర్డ్‌ కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

సంగారెడ్డి రూరల్‌ ఎస్సై మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి మండలం గజులగూడెం గ్రామానికి చెందిన యెల్లకొండ నరసింహులు (40), ఆయన భార్య మౌనిక (33) కారు లో శంకర్‌పల్లి నుంచి సంగారెడ్డి వైపు బయలుదేరారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో కంది గ్రామం వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. అనంతరం పల్టీలు కొట్టి బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న నరసింహులు, మౌనిక తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న సంగారెడ్డి రూరల్‌ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ప్రమాద వివరాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసూదన్‌రెడ్డి తెలిపారు. అతివేగం, అజాగ్రత్త ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.