Sand Reach | నాగిరెడ్డిపల్లి ఇసుక రీచ్ వద్ద ఉద్రిక్తత….

Sand Reach | నాగిరెడ్డిపల్లి ఇసుక రీచ్ వద్ద ఉద్రిక్తత….
- మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్న కర్ణాటక పోలీసులు..
- హద్దులు గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్.
Sand Reach | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వ భవనాలకు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పెద్దవాగు ఇసుక రీచ్ నుండి ఇసుక తరలించేందుకు అప్పటి నారాయణపేట కలెక్టర్ కోయ శ్రీ హర్ష అనుమతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని చేలేరు, తెలంగాణ రాష్ట్రంలోని నాగిరెడ్డిపల్లి పెద్దవాగు నుండి ప్రతినిత్యం ఇసుక(sand) తరలిస్తున్నారు.
ఈ రోజు కర్ణాటక రాష్ట్రంలోని సైదాపూర్ సిఐ, ఎస్ఐ పోలీసులతో ఇసుక రీచ్ వద్దకు వచ్చి తమ సరిహద్దు నుండి ఇసుక రవాణా చేస్తున్నారని నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఈడిగి రాజు టీఎస్ 38 టీ 25 43, కుమ్మరి ఆంజనేయులు టీజీ 38 టి 23 18, బై ని రాజు టీఎస్ 17 ఎఫ్ 4222 నెంబరు గల ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు.

దీంతో తమ బార్డర్ నుండి ఇసుక తరలిస్తుండగా తమ ట్రాక్టర్లు ఎందుకు పట్టుకుంటారని ట్రాక్టర్ యజమానులు కర్ణాటక పోలీసులను నిలదీయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఊట్కూర్ తాసిల్దార్ చింతా రవి, మక్తల్ సీఐ, ఊట్కూర్ ఎస్సై రమేష్ ఇసుక రీచ్(Sand Reach) వద్దకు వెళ్లి కర్ణాటక పోలీసులతో మాట్లాడగా తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తమ పరిధిలో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు.
గతంలో సైతం కర్ణాటక తెలంగాణ అధికారులు పెద్దవాగులో హద్దులు గుర్తించకపోవడంతో ఇరు ప్రాంతాల ప్రజలు సరిహద్దు ఇసుక రవాణా విషయంలో గొడవలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. కలెక్టర్ ఆన్లైన్ అనుమతి ఉన్న ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను కర్ణాటక పోలీసులు పట్టుకుని తరలించడంతో ఇసుక ట్రాక్టర్ల యజమానులు నాగిరెడ్డిపల్లి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండురాష్ట్రాల మధ్య పెద్దవాగు సరిహద్దు శాశ్వత పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు.
