Salary vs Job Title | సర్వేలో వెలువడిన ఆసక్తికర విషయాలు

  • పదోన్నతి వచ్చినా జీతం పెరగడం లేదంటున్న ఉద్యోగులు
  • 80 శాతం మంది హోదాల పెంపుపై అసంతృప్తి
  • వాలూవాక్స్ సంస్థ 2026 సర్వే లో వెల్లడి

ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే ఆనందమే.. హోదా పెరిగితే మరింత గర్వమే. కానీ ఆ హోదాతో పాటు జీతం పెరగకపోతే? ఇప్పుడు ఇదే ప్రశ్న ఉద్యోగులను ఆలోచింపజేస్తోంది. ‘మేనేజర్‌’, ‘సీనియర్‌ మేనేజర్‌’ అంటూ హోదాలు మారుతున్నా.. జీతం మాత్రం అదే స్థాయిలో ఉంటే దాని వల్ల ప్రయోజనం ఏమిటి? తాజా సర్వేలో ఉద్యోగుల అభిప్రాయాలు చూస్తే.. మంచి హోదా కంటే చేతికి వచ్చే జీతానికే ఎక్కువ విలువ ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: ఉద్యోగంలో పదోన్నతి వస్తే సాధారణంగా జీతం కూడా పెరుగుతుందని చాలామంది భావిస్తారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఓ తాజా సర్వే వెల్లడించింది. ఉద్యోగులకు ఉన్నత హోదాలు ఇస్తున్నప్పటికీ.. అందుకు తగినంతగా జీతాలు పెంచడం లేదని ఈ సర్వేలో తేలింది. అంతేకాదు.. మంచి హోదా కంటే ఎక్కువ జీతానికే ఉద్యోగులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడైంది.

ఇండీడ్ కోసం వాలూవాక్స్ సంస్థ 2026 మే, జూన్ నెలల్లో ఈ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా టైర్‌-1 నుంచి టైర్‌-3 నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ సర్వే జరిగింది. వివిధ రంగాలకు చెందిన 2,533 మంది ఉద్యోగులు, 1,211 మంది యజమానుల అభిప్రాయాలను సేకరించారు.

హోదా పెరుగుతోంది.. జీతం మాత్రం?

సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 80 శాతం మంది ఉద్యోగాల్లో హోదాల పెంపు సాధారణంగా మారిపోయిందని అభిప్రాయపడ్డారు. అంటే.. ఉద్యోగులకు జీతంలో పెద్దగా పెరుగుదల లేకపోయినా, పైస్థాయి హోదాలను ఇవ్వడం ఎక్కువైందని వారు భావిస్తున్నారు.

ముఖ్యంగా పదోన్నతుల విషయంలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. గత రెండేళ్లలో హోదా మారిన ప్రతి ముగ్గురు ఉద్యోగుల్లో దాదాపు ఒకరికి.. జీతం అసలు పెరగలేదని లేదా 5 శాతం కంటే తక్కువే పెరిగిందని సర్వేలో వెల్లడైంది.

హోదా కంటే ఎక్కువ జీతమే కావాలంటున్న ఉద్యోగులు

కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న సమయంలో మంచి హోదా వస్తుందా? లేక ఎక్కువ జీతం వస్తుందా? అనే ప్రశ్న ఎదురైతే.. ఉద్యోగుల్లో ఎక్కువ మంది జీతానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. సర్వేలో దాదాపు 52 శాతం మంది ఉద్యోగులు మంచి హోదా కంటే ఎక్కువ జీతాన్నే ఎంచుకుంటామని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఉద్యోగులకు హోదా విలువైనదే అయినప్పటికీ.. కెరీర్‌లో ఎదుగుదలను కొలిచే విషయంలో జీతం పెరుగుదలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు అర్థమవుతోంది.

హోదాలకు ఇంకా విలువ ఉంది

అయితే ఉద్యోగులు హోదాలను పూర్తిగా పట్టించుకోవడం లేదని కాదు. దాదాపు 70 శాతం మంది ఉద్యోగులు తమ హోదా భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. అలాగే 73 శాతం మంది మంచి హోదా ఉంటే భవిష్యత్‌లో తమను నియమించుకోవాలనుకునే సంస్థల దృష్టిలో తమ విలువ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. మరో 57 శాతం మంది తమ హోదా ఉద్యోగ సంతృప్తిపై ప్రభావం చూపుతుందని తెలిపారు.

దీంతో ఉద్యోగులు హోదాలను కోరుకోవడం లేదని చెప్పలేం. అయితే ఆ హోదాకు తగిన బాధ్యతలు, జీతం, కెరీర్‌లో నిజమైన ఎదుగుదల ఉండాలని వారు కోరుకుంటున్నట్లు సర్వే చెబుతోంది.

ప్రతిభావంతులను నిలుపుకునేందుకు హోదాలు

ఉద్యోగులను తమ సంస్థల్లో కొనసాగించేందుకు కొన్ని కంపెనీలు ఉన్నత హోదాలను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. దాదాపు 57 శాతం మంది యజమానులు తమ సంస్థలు ప్రతిభావంతులను ఆకర్షించడానికి లేదా కొనసాగించడానికి మెరుగైన హోదాలను కొంతవరకు లేదా ఎక్కువగా ఉపయోగిస్తున్నాయని చెప్పారు.

జీతాలు పెంచడానికి అవకాశం లేని సంస్థలకు ఇది ఒక మార్గంగా మారింది. జీతం పెంచకుండా ఉద్యోగికి ఉన్నత హోదా ఇవ్వడం ద్వారా అతని పనిని గుర్తించినట్లు చూపించవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. అదే సమయంలో కొత్త ఉద్యోగులను ఆకర్షించడానికి, మంచి పనితీరు చూపే వారిని సంస్థలోనే కొనసాగించడానికి కూడా ఈ విధానం ఉపయోగపడుతోంది.

ఉద్యోగులను ఆకర్షించి, ప్రతిభావంతులను సంస్థల్లో కొనసాగించాలనుకునే కంపెనీలు హోదా, బాధ్యత, జీతం.. ఈ మూడింటి మధ్య సరైన సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.