‘సలార్ 2’.. 2027లో పక్కా! ప్రభాస్ అభిమానులకు క్రేజీ అప్‌డేట్

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సలార్ 2’పై మరోసారి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌కు సంబంధించి పనులు వేగం పుంజుకున్నట్లు తెలుస్తోంది. ‘సలార్: సీజ్‌ఫైర్’తో భారీ విజయాన్ని అందుకున్న ఈ కాంబినేషన్‌పై రెండో భాగంపై అంచనాలు ఇప్పటికే తారస్థాయిలో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం 2027లో ఈ చిత్రానికి సంబంధించిన కీలక పనులను పూర్తి చేసేలా మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్.. జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2027 జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించారు. ‘డ్రాగన్’ పూర్తయిన వెంటనే ‘సలార్ 2: శౌర్యాంగ పర్వం’పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నట్లు ప్రశాంత్ నీల్ స్వయంగా స్పష్టం చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే ‘సలార్ 2’కు సంబంధించిన కథ, ఇతర ముందస్తు పనులను ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్లు తాజా సమాచారం. ఇటీవల ఈ చిత్రానికి ముందస్తు నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో సినిమా ఆగిపోయిందంటూ గతంలో వచ్చిన ప్రచారానికి తెరపడినట్లయింది.

మరోవైపు ప్రభాస్ కూడా వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2’ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సినిమాల పనులను పూర్తి చేసుకుంటూ ‘సలార్ 2’కు కాల్‌షీట్లు కేటాయించేలా ప్రణాళిక రూపొందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ను పూర్తి చేసే సమయానికి ప్రభాస్ కూడా తన ఇతర ప్రాజెక్టులను ఒక కొలిక్కి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం.

‘సలార్: సీజ్‌ఫైర్’లో దేవా, వరదరాజ మన్నార్ పాత్రల మధ్య ఉన్న స్నేహం, రాజకీయాలు, ఆధిపత్య పోరు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా తొలి భాగం ముగింపు అనేక ప్రశ్నలను మిగిల్చింది. దీంతో రెండో భాగంలో కథ ఎటువైపు సాగుతుందనే ఆసక్తి నెలకొంది. ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని హొంబాళే ఫిలిమ్స్ నిర్మిస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ‘శౌర్యాంగ పర్వం’పై అభిమానుల్లో ఇప్పటికే విపరీతమైన హైప్ ఉంది. అయితే 2027లో సినిమా విడుదలవుతుందనే అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2027లో చిత్రీకరణ, తదుపరి నిర్మాణ పనులు ముందుకు సాగే అవకాశం ఉంది. ‘డ్రాగన్’ తర్వాత ప్రశాంత్ నీల్ నేరుగా ‘సలార్ 2’పైకి రావడం మాత్రం అభిమానులకు భారీ ఊరటనిచ్చే అంశంగా మారింది.