Sai Dharam Tej | విమర్శలకు తనదైన శైలిలో సమాధానమిచ్చిన హీరో!

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ తాజాగా చేసిన ఒక సోషల్‌ మీడియా పోస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్‌పై కొందరు నెటిజన్లు రకరకాల ప్రశ్నలు వేయడమే కాకుండా ట్రోలింగ్ కూడా చేశారు. అయితే ఆ విమర్శలు, కామెంట్స్‌పై ఈ యువ హీరో ఆధారాలతో సహా గట్టిగా రీకౌంటర్ ఇచ్చారు.

అసలు ఏం జరిగిందంటే..

ఐదేళ్ల కిందట సాయిధరమ్‌ తేజ్‌ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం జరిగిన రోజును గుర్తుచేసుకుంటూ ఇటీవల సాయిధరమ్‌ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అయితే ఆ సమయంలో తనకు ప్రాణదానం చేసిన యువకుడు ‘ఫర్హాన్‌’ పేరును ఆ పోస్టులో ప్రస్తావించకపోవడంతో కొందరు నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పించారు.

ఆధారాలతో స్ట్రాంగ్ రిప్లై!

ఈ విమర్శలకు సమాధానంగా సాయిధరమ్‌ తేజ్ ఫర్హాన్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ మరో పోస్ట్ చేశారు. ప్రమాద సమయంలో తనను ఆదుకున్న ఫర్హాన్‌ను తాను ఎన్నటికీ మర్చిపోలేనని తేజ్ స్పష్టం చేశారు. ఇప్పటికే అతడికి ఆర్థికంగా సహాయం అందించడంతో పాటు అతడి తండ్రిని, ఫర్హాన్‌ను ప్రత్యేకంగా సత్కరించానని గుర్తుచేశారు. ప్రస్తుతం ఫర్హాన్‌పై కుటుంబ బాధ్యతలు ఉన్నాయని, అతడు తన ఉద్యోగంపై దృష్టి సారించేందుకు ఇతరత్రా ఇబ్బందులు కలిగించవద్దని స్వయంగా కోరినట్లు వెల్లడించారు.

అందుకే ఆ పోస్టులో ప్రస్తావించలేదు..

ఇటీవల తాను చేసిన పోస్టు ఉద్దేశం తనకు ఆశీర్వాదాలు, ప్రేమాభిమానాలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేయడమేనని తేజ్ స్పష్టం చేశారు. ఫర్హాన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పకపోవడాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. అంతేకాకుండా తనకు చికిత్స అందించిన వైద్యులు, అంబులెన్స్‌ డ్రైవర్‌ల గురించి ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నవారికి కూడా సమాధానమిచ్చారు. ప్రమాదం తర్వాత స్పృహలోకి వచ్చిన వెంటనే తాను చేసిన తొలి వీడియోలోనే తన కోలుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపినట్లు గుర్తుచేశారు.

తనను విమర్శిస్తున్నవారిపై కూడా తేజ్‌ ఎంతో పరిణతితో స్పందించారు. తనను తిడుతున్నా, విమర్శిస్తున్నా వాటిని కూడా ప్రేమ, అభిమానంలో భాగంగానే స్వీకరిస్తానని తేల్చిచెప్పారు. తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.