సెప్టెంబర్ 12న సహస్రగళ భగవద్గీత పారాయణ

మైలవరం,ఆంధ్రప్రభ: హిందూ చైతన్యం కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కోటి భగవద్గీత పారాయణ మహాయజ్ఞంలో భాగంగా మైలవరంలో సహస్రగళ సంపూర్ణ భగవద్గీత పారాయణ నిర్వహించనున్నారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ దివ్య ఆశీస్సులతో, దత్త విజయానంద తీర్థ స్వామీజీ అనుగ్రహంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. ద్వారకాతిరుమల దేవస్థాన దత్తత దేవాలయమైన మైలవరం వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 12న వెయ్యిమందితో భగవద్గీత పారాయణ నిర్వహించేందుకు నిర్ణయించారు.

ఈ కార్యక్రమానికి కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల నుంచి వెయ్యిమందికిపైగా పారాయణ బృందాల సభ్యులు పాల్గొననున్నారు. దేవస్థానం చైర్మన్ ఎస్‌వీ సుధాకర్‌రావు ప్రోత్సాహం, సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మైలవరం పారాయణ బృంద సభ్యులు చైర్మన్ సుధాకర్‌రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.