కార్యకర్తలే కాంగ్రెస్‌కు బలం
ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా పేదల ఓట్లను పరిరక్షించాలి..
ఉమ్మడి మెదక్ జిల్లా పీఏసీ సమావేశంలో నేతల ఘాటు వ్యాఖ్యలు
మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమని, ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యత కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం మెదక్ పట్టణంలోని వినాయక ఫంక్షన్ హాల్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా పీఏసీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మంత్రి దామోదర్ రాజనర్సింహ, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఏం చేశారో ప్రజలకు తెలుసని అన్నారు. అప్పటి ప్రభుత్వంలో జరిగిన దోపిడీ, భూకబ్జాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు నెల 20వ తేదీ వరకు జీతాలు అందని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం తమ ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తోందని తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ఎంత మంది రైతులపై కేసులు పెట్టారో హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని మహేష్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు, మార్ఫింగ్ వీడియోలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. కేటీఆర్ సోషల్ మీడియానే నమ్ముకున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఇళ్లు అమ్ముకున్న ఘటనలను ప్రజలు మర్చిపోలేదన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగించిందని ఆరోపించారు. మోదీ ఎన్ని కోట్ల ఉద్యోగాలు కల్పించారో బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో ఏర్పాటైన కంపెనీలను అదానీ, అంబానీలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని, రాష్ట్రంలో అర్హులైన పేదలు ఇల్లు లేకుండా ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పేదల పిల్లల కోసం సమీకృత పాఠశాలలను నిర్మిస్తున్నామని, విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందని, బీఆర్‌ఎస్‌లో రాజయ్య, ఈటల రాజేందర్ వంటి నేతలను అప్రజాస్వామికంగా తొలగించారని విమర్శించారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు.
కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో పదవులు వస్తాయని, ఓపిక పట్టాలని మహేష్‌కుమార్ గౌడ్ సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు ఉండేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పేదల ఓట్లను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కార్యకర్తలే కాంగ్రెస్‌కు బలం: మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని అన్నారు. తాము ఈ స్థాయిలో ఉన్నామంటే కార్యకర్తల కృషే కారణమని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, భవిష్యత్‌లోనూ పార్టీ అధికారంలోకి వచ్చేలా సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకు ఏదో ఒక రూపంలో న్యాయం చేస్తామని తెలిపారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా తమ ఓట్లను, పార్టీ కార్యకర్తల ఓట్లను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. పార్టీని కాపాడుకునే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీకి నష్టం చేసే వర్గాలను ప్రోత్సహిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని హెచ్చరించారు. పార్టీ ప్రయోజనాల కోసం ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
