జైనూర్‌లో ఈ నెల 6న సదరం క్యాంపు
- ఎముకల సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు
జైనూర్, ఆంధ్రప్రభ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 6న సదరం క్యాంపు నిర్వహించనున్నట్లు ఆదివాసీ మిత్ర బిల్పూర్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు ఆడ వెంకటేష్ తెలిపారు. గత ఏడాది నుంచి జైనూర్‌లో సదరం క్యాంపు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పిస్తూ కృషి చేసినట్లు పేర్కొన్నారు.
జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుమెత విశ్వనాథ్ సిఫారసుతో అధికారులు స్పందించారని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎముకలకు సంబంధించిన సమస్యలపై సదరం క్యాంపు నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు.
జైనూర్‌లో సదరం క్యాంపు నిర్వహించడం వల్ల కేరమెరి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వెంకటేష్ తెలిపారు. ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రమే క్యాంపునకు హాజరై సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాట్ల పరిశీలన
సదరం క్యాంపు నిర్వహణకు సంబంధించి మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుమెత విశ్వనాథ్‌రావు, జిల్లా కోఆర్డినేటర్ ఆడ వెంకటేష్, సర్పంచులు, నాయకులు జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. క్యాంపు నిర్వహణపై వైద్య సిబ్బందితో మాట్లాడి ఏర్పాట్లను పరిశీలించారు.
వారి వెంట జైనూర్ మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్ యాదవ్, సర్పంచులు మెస్రం స్పందన భూపతి, జానే రావు, మడవి లక్ష్మణ్, నాయకులు ప్రకాష్, ఆత్రం దత్తు తదితరులు ఉన్నారు.
