Sachivalayam-Tg-Acb-Trap | రూ.2 లక్షల చెక్కుకు రూ.లక్ష లంచం! సచివాలయం కేంద్రంగా ఏసీబీ ట్రాప్‌

Sachivalayam-Tg-Acb-Trap |ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కింద వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ బిల్లుల ప్రాసెసింగ్‌కు లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి పట్టుబడ్డారు. రూ.2 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు జారీ చేయడంతోపాటు మిగిలిన వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌ను ప్రాసెస్‌ చేసేందుకు రూ.లక్ష లంచం డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ తెలిపింది. గురువారం హైదరాబాద్‌ సిటీ రేంజ్‌-2 ఏసీబీ అధికారులు నిర్వహించిన ట్రాప్‌లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

సచివాలయంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆనందేశి రాఘవేందర్‌ (ఏవో-1), బషీర్‌బాగ్‌లోని పరిశ్ర‌మ భవన్‌లో తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఐడీసీ) కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మేడి వినోద్‌ (ఏవో-2)ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

రూ.లక్ష తీసుకుంటుండగా..

ఏసీబీ వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడికి సీఎంఆర్‌ఎఫ్‌ పథకం కింద రూ.2 లక్షల చెక్కు మంజూరైంది. ఆ చెక్కు జారీ చేయడంతోపాటు మిగిలిన వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌ను ప్రాసెస్‌ చేసేందుకు అధికారులు లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఫిర్యాదు ఆధారంగా అధికారులు ప‌థ‌కం ప్ర‌కారం ట్రాప్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఏవో-2 రూ.లక్ష లంచాన్ని స్వీకరించి ఏవో-1కు అందజేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఇద్దరినీ పట్టుకున్నారు. ఏవో-1 వద్ద నుంచి లంచం సొమ్ము రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఫోన్‌పేలోనూ రూ.5 వేలు?

ఇదే వ్యవహారంలో గతంలో కూడా ఏవో-1, ఏవో-2 లు ఫోన్‌పేలో రూ.5 వేలు లంచంగా తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది. అధికారిక విధులను నిబంధనల ప్రకారం నిర్వహించకుండా, అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న అనంతరం సీఎంఆర్‌ఎఫ్‌ విభాగానికి సంబంధించిన అంశాలపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. పెద్ద మొత్తంలో లంచం డిమాండ్‌ చేసిన వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.

నిందితుల రిమాండ్‌కు చర్యలు

నిందితులను నాంపల్లిలోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల మొదటి అదనపు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను ఏసీబీ వెల్లడించలేదు.