Sabarimala Yatra |శబరిమల వెళ్తున్నారా? ఈ కొత్త డిజిటల్ సేవలు మీకు తెలుసా!

కేరళం, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్‌: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళం ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. లక్షలాది మంది భక్తులకు యాత్రను మరింత సులభతరం చేసేందుకు కొత్త డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పతనంతిట్ట జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ కొత్తగా ‘శబరి పోర్టల్‌’తో పాటు ప్రత్యేక వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. వీటి ద్వారా భక్తులు దర్శన సమయాలు, బస్సుల వివరాలు, వైద్య సదుపాయాలు, అత్యవసర సేవలు వంటి సమాచారాన్ని ఒకే చోట తెలుసుకోవచ్చు.

శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు అవసరమైన సమాచారాన్ని సులభంగా అందించడమే ఈ పోర్టల్‌ ముఖ్య ఉద్దేశం. రోజువారీ పూజల సమయాలు, దర్శన వివరాలను ఇందులో తెలుసుకోవచ్చు. వర్చువల్ క్యూ బుకింగ్ కోసం నేరుగా లింకులు కూడా అందుబాటులో ఉన్నాయి. పతనంతిట్ట కలెక్టరేట్‌కు చెందిన అజిత్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బి. యగేష్ ఈ పోర్టల్‌ను రూపొందించారు.

ఈ పోర్టల్‌లో ‘శబరి మ్యాప్‌’ పేరుతో ప్రత్యేక సదుపాయాన్ని అందించారు. దీని ద్వారా పంబ, నిలక్కల్‌, సన్నిధానం ప్రాంతాల్లో తాగునీటి కేంద్రాలు, మరుగుదొడ్లు, ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు, పార్కింగ్ ప్రదేశాలను గుర్తించవచ్చు. అంతేకాదు.. కేరళలోని ముఖ్యమైన ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల చిరునామాలు, ఫోన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. చెంగన్నూర్, తిరువల్ల, కొట్టాయం రైల్వే స్టేషన్ల రైళ్ల సమయాలను కూడా తెలుసుకోవచ్చు.

శబరిమల వెళ్లే భక్తులకు రవాణా విషయంలోనూ ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. పంబకు వెళ్లే బస్సుల సమయాలతో పాటు నిలక్కల్‌ నుంచి పంబకు నడిచే షటిల్ బస్సుల వివరాలను తెలుసుకోవచ్చు. దీంతో భక్తులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. శబరిమలలో వస్తువులు కొనుగోలు చేసే భక్తుల కోసం ‘చెక్ మై బిల్‌’ అనే ప్రత్యేక సదుపాయాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా వస్తువుల అసలు ధరలను తెలుసుకోవచ్చు. దుకాణదారులు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు.

యాత్ర సమయంలో మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులు పోగొట్టుకున్నా ఈ పోర్టల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వవచ్చు. కుటుంబ సభ్యులు తప్పిపోయినా వివరాలు తెలియజేసేందుకు ‘లాస్ట్ అండ్ ఫౌండ్’ సదుపాయం ఉపయోగపడుతుంది. వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా కూడా భక్తులు తమకు అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు.