sabari-river-flood | గ్రామాల చుట్టూ చేరుతున్న వరద నీరు..
ఏజెన్సీలో స్తంభించిన రాకపోకలు
sabari-river-flood | చింతూరు, ఆంధ్రప్రభ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండగా, ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోనూ గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు చింతూరు మండలం మీదుగా ప్రవహిస్తున్న శబరి నదిలోకి చేరడంతో నది ఉధృతంగా ప్రవహిస్తోంది. క్రమంగా పెరిగిన నీటిమట్టం 41.5 అడుగుల గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో లోతట్టు గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. దీంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
మూడు రోజులుగా వరద ముంపు మన్యం ప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఏ సమయంలో ఎటువైపు నుంచి వరద ముంచుకొస్తుందోనన్న భయం వారిని వెంటాడుతోంది. చింతూరు మన్యంలో సీలేరు, శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చింతూరు, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లి రహదారులపైకి చేరడంతో పలు మార్గాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
చింతూరు మండలంలోని ఏజీ కోడేరు ఒడ్డు గుంపు, చింతూరు శబరి ఒడ్డు, లారీ యూనియన్ కార్యాలయం సమీపంలోని ఇళ్ల వద్దకు వరద నీరు చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే ఇళ్లను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. శబరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దానికి అనుసంధానమైన వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా ప్రధాన రహదారులపై వరద నీరు చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మండలంలోని చుటూరు–ముకునూరు గ్రామాల మధ్య సోకిలేరు వాగు రహదారిపైకి చేరడంతో 11 గిరిజన గ్రామాలతో పాటు వీఆర్ పురం మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. చట్టి–కుమ్మూరు గ్రామాల మధ్య చంద్రవంక వాగు రహదారిపైకి చేరడంతో కుమ్మూరు గ్రామానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదే విధంగా ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల మధ్య కుయుగూరు–నిమ్మలగూడెం గ్రామాల వద్ద జాతీయ రహదారి 326పై వరద నీరు చేరింది. దీంతో అంతర్రాష్ట్ర రాకపోకలు స్తంభించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాల తీవ్రతకు గుడూరు పంచాయతీ పరిధిలోని దబ్బగూడెంలో ఓ ఇల్లు కూలిపోయింది. కొన్ని చోట్ల రహదారులు కొట్టుకుపోగా, పెద్ద చెట్లు నేలకొరిగాయి. వరదల నేపథ్యంలో పోలవరం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు జేసీ ప్రశాంత్ కుమార్, చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొక్వాల్, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, సీఐ, ఎస్సైలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బాధితులకు సహాయ సహకారాలు అందిస్తూ, అవసరమైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
