Russia-Ukraine-War : ర‌ష్యా స్వైర విహారం Andhra Prabha Top News

Russia-Ukraine-War : ర‌ష్యా స్వైర విహారం Andhra Prabha Top News

  • డ్నిప్రో వంతెనపై వైమానిక దాడి
  • కీవ్‌పై దాడులు కొనసాగిస్తాం
  • ప్రతీకార దాడులు ఆపే ప్రసక్తే లేదు
  • విదేశీయులు, దౌత్యవేత్తలు ఉక్రెయిన్‌ వీడాలి
  • మాప్కో హెచ్చిరిక జారీ

(మాస్కో, ఆంధ్రప్రభ ప్రతినిధి)

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రతరం కానున్నాయా? అంటే.. అవుననే సంకేతాలిస్తోంది మాస్కో. కీవ్‌తో పాటు ఉక్రెయిన్‌లోని ఇతర నగరాల్లో లక్ష్యిత ప్రతీకార దాడులను కొనసాగిస్తామని రష్యా శనివారం స్పష్టం చేసింది. అంతేకాదు.. ఉక్రెయిన్‌లో ఉంటున్న విదేశీయులు, దౌత్యవేత్తలు వెంటనే దేశం వీడాలని హెచ్చరించింది.

ఉక్రెయిన్‌ సాయుధ బలగాలు రష్యాలోని పౌరులు, పౌర మౌలిక వసతులపై ఉగ్రచర్యలకు పాల్పడుతున్నాయని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. దీనికి ప్రతిస్పందనగా కీవ్‌తో పాటు ఇతర ఉక్రెయిన్‌ నగరాల్లోని సైనిక స్థావరాలపై తమ సాయుధ బలగాలు లక్ష్యిత దాడులు కొనసాగిస్తున్నాయని తెలిపింది.

విదేశీయులకు మాస్కో హెచ్చరిక

ఉక్రెయిన్‌లో ఉంటున్న విదేశీయులు, ముఖ్యంగా దౌత్య కార్యాలయాల సిబ్బంది అక్కడ ఉండొద్దని రష్యా విదేశాంగ శాఖ సూచించింది. ఉక్రెయిన్‌కు వెళ్లే ఆలోచనను కూడా విరమించుకోవాలని హెచ్చరించింది. తమ హెచ్చరికను పట్టించుకోకుండా ఉక్రెయిన్‌లోనే ఉండటం వల్ల ఏదైనా ప్రతికూల పరిణామం ఎదురైతే.. అందుకు బాధ్యత పూర్తిగా హెచ్చరికను విస్మరించిన వారిదేనని రష్యా పేర్కొంది.

డ్నిప్రో వంతెనపై దాడి

ఇటీవలి కాలంలో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని మౌలిక వసతులపై రష్యా దాడులు పెరిగాయి. శనివారం డ్నిప్రో నదిపై ఉన్న ఓ వంతెనపై కూడా వైమానిక దాడి జరిగినట్లు సమాచారం. కీవ్‌లో దాదాపు 30 లక్షల మంది ప్రజల జీవనం ఈ దాడులతో తీవ్రంగా ప్రభావితమవుతోందని Reuters పేర్కొంది. చలికాలం సమీపిస్తున్న సమయంలో దాడులు ఉధృతం కావడం రాజధాని ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది.

‘ఉక్రెయిన్ మూల్యం చెల్లించాల్సిందే’

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా ఈ వారంలో ఇదే తరహా హెచ్చరిక చేశారు. రష్యాపై ఉక్రెయిన్‌ జరుపుతున్న దాడులకు ఆ దేశం మూల్యం చెల్లిస్తోందని, ఇకపైనా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు లక్ష్యాలపై రష్యా బలగాలు క్రమబద్ధంగా దాడులు కొనసాగిస్తాయని పుతిన్‌ స్పష్టం చేశారు.

నల్ల సముద్రంలోనూ ఉద్రిక్తత

ఇదిలా ఉండగా.. ఇటీవలి నెలల్లో నల్ల సముద్రంలో ఒకరి ధాన్యం రవాణా నౌకలపై మరొకరు దాడులు పెంచినట్లు సమాచారం. రష్యా చమురు శుద్ధి కేంద్రాలు, ఇతర పారిశ్రామిక సంస్థలపై ఉక్రెయిన్‌ బలగాలు దాడులు చేస్తున్నాయని మాస్కో ఆరోపిస్తోంది. అదే సమయంలో రష్యా సరిహద్దు ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడుల్లో పౌరులు మరణిస్తున్నారని రష్యా పేర్కొంటోంది. అయితే పౌరులను, పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారన్న ఆరోపణలను రష్యా, ఉక్రెయిన్‌ రెండూ ఖండిస్తున్నాయి. యుద్ధంలో తాము సైనిక లక్ష్యాలనే లక్ష్యంగా చేసుకుంటున్నామని ఇరుపక్షాలు చెబుతున్నాయి.