Russia-Jet-Drones-400-Kmph : య‌మ‌ డ్రోన్లు గురూ: Andhra Prabha Top Stoey

Russia-Jet-Drones-400-Kmph : య‌మ‌ డ్రోన్లు గురూ: Andhra Prabha Top Stoey

  • రష్యా దూకుడే దూకుడు
  • ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి
  • 400 కి.మీ. వేగంతో డ్రోన్లు
  • ఇంటర్‌సెప్టర్లూ క‌ళ్ల‌ప్ప‌గింత
  • 3 నెలల్లో 6 రెట్లు పెరిగిన జెట్‌ డ్రోన్ల వినియోగం

(కీవ్‌/లండన్‌, ఆంధ్రప్రభ ప్ర‌తినిధి)
:
రష్యా దాడులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్‌కు మరో కొత్త సవాల్‌ ఎదురైంది. ఇంతకాలం ఉక్రెయిన్‌ సమర్థంగా ఎదుర్కొన్న కారు చౌక ప్రొపెల్లర్‌తో నడిచే షహెద్‌ డ్రోన్ల స్థానంలో ఇప్పుడు మరింత వేగవంతమైన జెట్‌ ఇంజిన్‌ డ్రోన్లు రంగంలోకి దిగాయి. గంటకు 400 కిలోమీటర్లకు మించిన వేగంతో దూసుకొస్తున్న వీటిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్‌ రూపొందించిన ఇంటర్‌సెప్టర్‌ డ్రోన్లు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని తెలుస్తోంది.

జూలై ప్రారంభంలో ఉక్రెయిన్‌ సైన్యం పెద్ద సంఖ్యలో డ్రోన్‌ తయారీ సంస్థలను ఆహ్వానించి కొత్త తరహా ఇంటర్‌సెప్టర్‌ డ్రోన్లను పరీక్షించింది. జెట్‌ ఇంజిన్‌తో దూసుకొచ్చే రష్యా డ్రోన్లను అడ్డుకోవడమే ఈ పరీక్ష ప్రధాన ఉద్దేశం. అయితే గంటకు 400 కి.మీ.కుపైగా వేగంతో ప్రయాణించిన కొన్ని ఇంటర్‌సెప్టర్‌ డ్రోన్లను నియంత్రించడం కష్టంగా మారింది. మరికొన్ని సమీపంలోని పొలాలు, అడవుల్లో కూలిపోయినట్లు ఈ వ్యవహారంపై అవగాహన ఉన్న వర్గాలు వెల్లడించాయి.
రెండు నెలల్లో సాంకేతికంగా చాలా మార్పులు చోటుచేసుకున్నప్పటికీ.. జెట్‌ డ్రోన్ల విషయంలో ఉక్రెయిన్‌ ఇంకా వెనుకబడే ఉందని ఆ దేశ సైనికాధికారులే అంగీకరిస్తున్నారు.

‘మనమే అవకాశాన్ని చేజార్చుకున్నాం’

ఉక్రెయిన్‌ 3వ ఆర్మీ కార్ప్స్‌ డిప్యూటీ కమాండర్‌ మాక్సిమ్‌ జోరిన్‌ ఇటీవల ఈ అంశంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. జెట్‌ డ్రోన్ల విషయంలో రష్యా భారీగా ఉత్పత్తి, వినియోగాన్ని చేపట్టిందని, వాటిని ఎదుర్కోవడానికి తమ వద్ద స్పష్టమైన పరిష్కారం లేదని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ వైమానిక దళం డిప్యూటీ కమాండర్‌ యూరీ చెరెవాషెంకో మాత్రం త్వరలోనే పరిస్థితి మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వేగవంతమైన ఇంటర్‌సెప్టర్‌ డ్రోన్లను అభివృద్ధి చేయడం కష్టమే అయినా.. తక్కువ ఖర్చుతో భారీ సంఖ్యలో తయారు చేయగల ఆయుధ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

జెట్‌ డ్రోన్ల ముప్పుతో కీవ్ గ‌జ‌గ‌జ‌

రష్యా గత మూడు నెలల్లో జెట్‌ డ్రోన్ల వినియోగాన్ని దాదాపు ఆరు రెట్లు పెంచింది. రాయిటర్స్‌కు అందిన ఉక్రెయిన్‌ సైనిక గణాంకాల ప్రకారం.. జూన్‌లో 240 నుంచి 500 కి.మీ. వేగంతో ప్రయాణించే సుమారు 450 డ్రోన్లను రష్యా ప్రయోగించింది. ఆ సంఖ్య ఆగస్టులో దాదాపు 2,850కి చేరింది. సాధారణ షహెద్‌ డ్రోన్లు గంటకు 200 కి.మీ. కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. వాటిని ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌ ఇప్పటికే సమర్థవంతమైన రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేసింది. దీంతో కొన్ని సందర్భాల్లో డ్రోన్లను అడ్డుకునే రేటు 90 శాతానికి చేరింది. దీంతో రష్యా మరింత వేగవంతమైన జెట్‌ డ్రోన్ల వైపు మళ్లింది. రష్యా నెలకు దాదాపు 3,000 జెట్‌ డ్రోన్లను ఉత్పత్తి చేస్తోందని ఉక్రెయిన్‌ రక్షణ నిఘా విభాగం అంచనా వేస్తోంది. వీటిలో కొన్ని త్రిభుజాకార రెక్కలతో ఉండగా.. మరికొన్ని చిన్న రెక్కలతో క్రూయిజ్‌ క్షిపణులను పోలి ఉంటున్నాయి. కీవ్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాలే ఈ దాడుల్లో ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ప్రయోగించిన మొత్తం డ్రోన్లలో దాదాపు ఐదో వంతు ఈ ప్రాంతంపైనే వచ్చాయి. నల్ల సముద్ర తీరంలోని కీలక ఓడరేవు నగరం ఒడెస్సా కూడా భారీ దాడులను ఎదుర్కొంటోంది.

కత్తి-డాలు సాము

జెట్‌ డ్రోన్లలో అత్యంత ప్రమాదకరమైన అంశం వాటిని మానవ ఆపరేటర్లు మార్గనిర్దేశం చేయగలగడం అని చెరెవాషెంకో తెలిపారు. అవసరాన్ని బట్టి గాల్లోనే దిశను, ఎత్తును మార్చే సామర్థ్యం ఉండటంతో వాటిని అడ్డుకోవడం మరింత కష్టమవుతోందన్నారు. ఇటీవల కీవ్‌ మధ్య ప్రాంతంలో జెట్‌ డ్రోన్లు లక్ష్యాలపై దాడులు చేశాయి. గత వారం ఉక్రెయిన్‌ భద్రతా సంస్థ ఎస్‌బీయూ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిలో చీఫ్‌ కార్యాలయాన్ని అత్యంత కచ్చితత్వంతో డ్రోన్‌ ఢీకొట్టినట్లు అధికారులు, సైనిక విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిని మాన్యువల్‌గా నియంత్రించి ఉండొచ్చని అంచనా. సెంటర్‌ ఫర్‌ ఏ న్యూ అమెరికన్‌ సెక్యూరిటీకి చెందిన శామ్యూల్‌ బెండెట్‌.. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని నిరంతరం మారుతున్న ‘కత్తి-డాలు’ పోరాటంగా అభివర్ణించారు. ఒక దేశం కొత్త సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తే.. ప్రత్యర్థి దానికి ప్రతిస్పందనగా మరో సాంకేతికతను తీసుకొస్తోందని పేర్కొన్నారు.

ఇంటర్‌సెప్టర్‌ డ్రోన్లు విఫలం ?

గత ఏడాది నెలకు వేల సంఖ్యలో ఉక్రెయిన్‌పైకి వచ్చిన షహెద్‌ డ్రోన్లను అడ్డుకునేందుకు కీవ్‌ తక్కువ ఖర్చుతో కూడిన ఇంటర్‌సెప్టర్‌ డ్రోన్లను అభివృద్ధి చేసింది. వీటి ధర సాధారణంగా 2,000 డాలర్లలోపే ఉంటుంది. ఇవి పెద్ద సంఖ్యలో వస్తున్న డ్రోన్లను సమర్థంగా కూల్చగలిగాయి. కానీ జెట్‌ డ్రోన్ల వేగాన్ని అందుకోవడం మాత్రం ఈ ఇంటర్‌సెప్టర్లకు కష్టంగా మారింది. కొన్ని జెట్‌ డ్రోన్లు మలుపులు తిరిగే సమయంలో వేగం తగ్గించుకుంటే వాటిని ఢీకొట్టే అవకాశం ఉంటుందని ఇంటర్‌సెప్టర్‌ డ్రోన్‌ కంపెనీ కమాండర్‌ బోరిస్‌ డోలినా తెలిపారు. అయితే రష్యా ఇప్పటికే డ్రోన్లలో సమీపిస్తున్న వస్తువులను గుర్తించి, అవసరమైతే వాటి వేగాన్ని ఆటోమేటిక్‌గా పెంచే వ్యవస్థలను అమలు చేస్తోందని హెచ్చరించారు.
ఉక్రెయిన్‌లో ఇప్పటికే వెయ్యికి పైగా ఇంటర్‌సెప్టర్‌ డ్రోన్‌ బృందాలు శిక్షణ పొందాయి. వేగవంతమైన ఇంటర్‌సెప్టర్ల తయారీకి సంస్థలు పోటీపడుతున్నాయి. కొన్ని జెట్‌ ఇంజిన్లతో నడిచే ఇంటర్‌సెప్టర్లను కూడా అభివృద్ధి చేస్తున్నాయి. అయితే జూలై పరీక్షలో ఎదురైన సమస్యలు ఈ ప్రయత్నాలు ఇంకా పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదని స్పష్టం చేస్తున్నాయి. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ ప్రకారం.. జెట్‌ డ్రోన్లను అడ్డుకునే సాంకేతికతపై 60కి పైగా ఉక్రెయిన్‌ కంపెనీలు పనిచేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కొద్దిమాత్రమే చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించాయి.

కొత్త పరిష్కారాలపై దృష్టి

జెట్‌ డ్రోన్లను ఎదుర్కొనేందుకు తక్కువ ఖర్చుతో కూడిన కొత్త తరం గైడెడ్‌ క్షిపణులు అత్యంత ఆశాజనక పరిష్కారంగా కనిపిస్తున్నాయని అధికారులు, నిపుణులు చెబుతున్నారు. పాశ్చాత్య దేశాల నుంచి ఉక్రెయిన్‌కు అందిన ఖరీదైన వైమానిక రక్షణ క్షిపణులు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. పైగా ఒకేసారి భారీ సంఖ్యలో దూసుకొచ్చే జెట్‌ డ్రోన్లను ఎదుర్కొనేలా అవి రూపొందించబడలేదు.

కొత్త రాకెట్లలో కొన్ని ఇప్పటికే పరీక్షలకు గురవుతున్నాయని చెరెవాషెంకో తెలిపారు. తాము కూల్చాల్సిన డ్రోన్ల కంటే ఈ రాకెట్ల ధర గణనీయంగా తక్కువగా ఉంటుందని చెప్పారు. గతంలో తప్పుడు జీపీఎస్‌ సమాచారాన్ని పంపడం ద్వారా కొన్ని రష్యా డ్రోన్లను దారి మళ్లించడంలో ఉక్రెయిన్‌ విజయం సాధించింది. అయితే తాజా జెట్‌ డ్రోన్లలో అధునాతన 16-ఛానల్‌ యాంటెన్నాలు వినియోగిస్తున్నందున జామింగ్‌, సిగ్నల్‌ అంతరాయాలకు అవి తక్కువగా ప్రభావితమవుతున్నాయి.

ఒకే వ్యవస్థగా డ్రోన్ల నెట్‌వర్క్‌

వ్యక్తిగతంగా పనిచేసే రక్షణ వ్యవస్థలతో ఈ ముప్పును ఎదుర్కోవడం ఇక సాధ్యం కాదని ఫ్లై గ్రూప్‌ ఉక్రెయిన్‌ సంస్థకు చెందిన అనటోలీ ఖ్రాప్‌చిన్స్కీ అభిప్రాయపడ్డారు. అనేక పరికరాలు ఒకే వ్యవస్థగా పనిచేసే నెట్‌వర్క్‌ ఆధారిత రక్షణ విధానం అవసరమని చెప్పారు. శత్రు డ్రోన్‌కు తప్పుడు మార్గనిర్దేశక సమాచారాన్ని అందించి.. అది లక్ష్యం వైపు వెళ్తున్నట్లు భావించేలా చేయడం, చివరికి దాని ఆటోపైలట్‌ తప్పుడు కోఆర్డినేట్ల ఆధారంగా దిశ మార్చుకునేలా చేయడం ఈ విధానంలో సాధ్యమవుతుందని వివరించారు.

మరోవైపు ప్రస్తుతం ఉన్న ఇంటర్‌సెప్టర్‌ డ్రోన్లు తమ లక్ష్యాల కంటే నెమ్మదిగా ఉన్నప్పటికీ.. వెనుక నుంచి వెంటాడే బదులు ఎదురెదురుగా ఢీకొనే విధానంలో దాడి చేసేలా వాటిని మార్చవచ్చని డ్రోన్‌ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు డ్రోన్‌ ప్రయాణ మార్గాన్ని అత్యంత కచ్చితంగా లెక్కించే ఏఐ ఆధారిత టార్గెటింగ్‌ వ్యవస్థలు అవసరం.
ఇలాంటి ఎదురెదురు అడ్డుకునే ప్రయోగాలు ఇప్పటికే ఆటోమేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌, మాన్యువల్‌గా నియంత్రించే డ్రోన్లతో విజయవంతంగా నిర్వహించినట్లు చెరెవాషెంకో తెలిపారు. భారీ స్థాయిలో వినియోగించేందుకు మరింత అభివృద్ధి అవసరమైనప్పటికీ.. ఇదే భవిష్యత్తులో వైమానిక రక్షణకు కీలక మార్గంగా మారుతుందని పేర్కొన్నారు.

యుద్ధ విమానాలపైనే భారం

ప్రస్తుతం మాత్రం జెట్‌ డ్రోన్లను వెంబడించేంత వేగం ఉన్న సైనిక విమానాలపైనే ఎక్కువ భారం పడుతోంది. అయితే గాల్లో ప్రయోగించే క్షిపణుల నిల్వలు తగ్గిపోతుండటంతో పైలట్లు డ్రోన్లను కూల్చేందుకు విమానంలోని ఫిరంగులను ఉపయోగించాల్సిన పరిస్థితి పెరుగుతోంది. ఈ విధానం అత్యంత ప్రమాదకరం. డ్రోన్‌ను ఫిరంగులతో కూల్చినప్పుడు దాని శకలాలు విమానానికే ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుంది. దీంతో రష్యా జెట్‌ డ్రోన్ల సంఖ్య మరింత పెరిగితే.. రానున్న శీతాకాలంలో ఉక్రెయిన్‌ వైమానిక రక్షణకు ఇది అత్యంత పెద్ద సవాలుగా మారే అవకాశముంది.