Russia-Gas-Europe-Nord-Stream : ఐరోపాకు రష్యా గ్యాస్ …!? Andhra Prabha Top Story
Russia-Gas-Europe-Nord-Stream : ఐరోపాకు రష్యా గ్యాస్ …!? Andhra Prabha Top Story
- తెర మీదకు నార్డ్ స్ట్రీమ్
- రంగంలోకి అమెరికా ఇన్వెన్టర్
- . కుష్నర్–దిమిత్రియేవ్ మంతనాలు
(బెర్లిన్/వాషింగ్టన్, ఆంధ్రప్రభ ప్రతినిధి)
ఉక్రెయిన్ యుద్ధంతో తెగిపోయిన అమెరికా–రష్యా సంబంధాలకు వ్యాపార మార్గం ద్వారా కొత్త మలుపు తిప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయా..? యూరప్‌కు రష్యా సహజవాయువు సరఫరా చేసిన నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైప్‌లైన్లలోకి అమెరికా పెట్టుబడిదారుడిని తీసుకురావడంపై ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరుగుతున్నట్లు రాయిటర్స్ ప్రత్యేక కథనం వెల్లడించింది. అమెరికా ప్రత్యేక ప్రతినిధి జారెడ్ కుష్నర్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సన్నిహిత సలహాదారు కిరిల్ దిమిత్రియేవ్ ఈ చర్చల్లో కీలకంగా ఉన్నట్లు సమాచారం.
మాస్కో.. న్యూయార్క్‌లో భేటీలు
కుష్నర్, దిమిత్రియేవ్ ఇటీవలి వారాల్లో మాస్కో, న్యూయార్క్‌లలో సమావేశమైనట్లు సమాచారం. ఆ భేటీల్లో నార్డ్ స్ట్రీమ్ అంశంపై ఎంతవరకు చర్చ జరిగిందన్నది స్పష్టంగా తెలియకపోయినా.. ఈ అంశం మాత్రం ఇరు వర్గాల చర్చల అజెండాలో కొనసాగుతున్నట్లు ఇద్దరు వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి.రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు కాల్పుల విరమణను కుదిర్చే ప్రయత్నాల్లో కుష్నర్ ఉన్నారు. వ్యాపార సంబంధాలను పునరుద్ధరించడం ద్వారా శాంతి ప్రక్రియకు ఊతమివ్వవచ్చన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది.యుద్ధం ముగిసిన తర్వాత రష్యా నుంచి యూరప్‌కు ఇంధన సరఫరాలు తిరిగి ప్రారంభమైతే.. అందులో అమెరికా పెట్టుబడిదారులకు కూడా ఆర్థిక ప్రయోజనం కలిగేలా ఒప్పందం ఉండవచ్చన్నది చర్చల వెనుక ఉన్న ఆలోచనగా సమాచారం.
‘అమెరికా ప్రయోజనాలే ముఖ్యం’
నార్డ్ స్ట్రీమ్‌పై జరుగుతున్న చర్చల గురించి అడిగినప్పుడు వైట్‌హౌస్ అధికారి ఒకరు కీలక వ్యాఖ్య చేశారు. ఏ ఒప్పందమైనా రష్యాతో అమెరికా ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (DFC), అమెరికా ట్రెజరీ శాఖల ద్వారా చర్చించాల్సి ఉంటుందని చెప్పారు. ఆ ఒప్పందం అమెరికా పన్ను చెల్లింపుదారులు, అమెరికా కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేలా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
నార్డ్ స్ట్రీమ్‌పై ఇటీవల ఎలాంటి చర్చలు జరగలేదని మరోసారి వైట్‌హౌస్ అధికారి రాయిటర్స్‌కు తెలిపారు. దీంతో అసలు చర్చల పరిధి ఎంతవరకు ఉందన్నది ఇంకా స్పష్టంగా లేదు.
జర్మనీకి మళ్లీ రష్యా గ్యాస్?
రష్యా నుంచి జర్మనీకి గ్యాస్ సరఫరాలను పునరుద్ధరించాలని దిమిత్రియేవ్ చాలాకాలంగా వాదిస్తున్నారు. సెప్టెంబర్ 2026లో ఆయన అమెరికా ఇంధన శాఖ, ట్రెజరీ శాఖ ప్రతినిధులతో భేటీ అయి అమెరికా–రష్యా ఇంధన రంగంలో సాధ్యమైన కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. అమెరికా ప్రభుత్వం నిజంగా జర్మనీకి రష్యా గ్యాస్ సరఫరాలను తిరిగి ప్రారంభించడంపై ఎంత ఆసక్తి చూపుతోందన్నది ఇంకా స్పష్టంగా లేదు.ప్రస్తుతం పరిస్థితుల్లో ఇలాంటి ఒప్పందం మధ్యకాలంలో కుదిరే అవకాశం తక్కువగా ఉందని ఓ అమెరికా అధికారి పేర్కొన్నారు.
నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్లపై అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అందువల్ల ప్రస్తుత నిబంధనల ప్రకారం వాటిని తిరిగి ప్రారంభించడం చట్టపరంగా సాధ్యం కాదు.
ట్రంప్ ఆంక్షలు సడలిస్తే?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అమెరికా ఆంక్షలను సడలించే లేదా మినహాయింపు ఇచ్చే అవకాశం కలిగి ఉన్నారు.కానీ నవంబర్ 2026 మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు కాంగ్రెస్ నియంత్రణను సాధిస్తే ఆంక్షలను సడలించడం మరింత కష్టతరమవుతుందని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి.
జర్మనీకి ఇష్టం లేదు!
రష్యాతో యుద్ధం కారణంగా తమ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు జర్మనీతో పాటు అనేక యూరోపియన్ దేశాలు బిలియన్ల యూరోలు ఖర్చు చేస్తున్నాయి. ఈ సమయంలో రష్యా గ్యాస్ కొనుగోళ్లను మళ్లీ ప్రారంభించడాన్ని జర్మనీ తీవ్రంగా వ్యతిరేకించే అవకాశముంది. జర్మనీ ఆర్థిక, ఇంధన మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. నార్డ్ స్ట్రీమ్, రష్యా గ్యాస్‌పై యూరోపియన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయని చెప్పారు. రష్యా గ్యాస్‌కు జర్మనీ ప్రత్యామ్నాయాలను ఇప్పటికే కనుగొందని తెలిపారు. పైప్‌లైన్లను తిరిగి తెరవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని.. ప్రస్తుతం అలాంటి పునఃప్రారంభం తమ ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
2022కు ముందు ఏం జరిగింది?
రష్యా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి ముందు, జర్మనీ తన అవసరమైన గ్యాస్‌లో సగానికి పైగా రష్యా నుంచే నార్డ్ స్ట్రీమ్-1, నార్డ్ స్ట్రీమ్-2 పైప్‌లైన్ల ద్వారా కొనుగోలు చేసేది. యుద్ధం మొదలైన తర్వాత రష్యా యూరప్‌కు గ్యాస్ సరఫరాలను తగ్గించింది. ఆ తర్వాత 2022 సెప్టెంబర్‌లో సముద్రగర్భంలో జరిగిన వరుస పేలుళ్లలో నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్లు దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి వాటి కార్యకలాపాలు నిలిచిపోయాయి.
రష్యాపై యూరప్‌లో అనుమానాలు
అమెరికా–రష్యా మధ్య జరుగుతున్న తాజా చర్చలకు యూరప్‌లో మాత్రం అనుమానాలు వెంటాడుతున్నాయి.ఈ ఏడాది ప్రారంభంలో ఐదు యూరోపియన్ గూఢచారి సంస్థల అధిపతులు రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. రష్యా వెంటనే యుద్ధాన్ని ముగించాలనే ఉద్దేశంతో లేదని, అమెరికాతో చర్చలను వ్యాపార ఒప్పందాల కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.ఉక్రెయిన్‌కు భారీగా సైనిక సహాయం అందిస్తున్న జర్మనీతో రష్యా సంబంధాలు కూడా దారుణంగా దిగజారాయి. రష్యా తమపై వ్యవస్థీకృత ‘హైబ్రిడ్ దాడులు’ చేస్తోందని జర్మన్ అధికారులు ఆరోపిస్తున్నారు.
‘ఇది యూరప్‌కు ఖరీదైన ఒప్పందం’
జర్మనీలోని కొందరు ఎంపీలు రష్యాతో మళ్లీ వ్యాపార సంబంధాలు నెలకొల్పడం ద్వారా మాస్కోకు ప్రయోజనం చేకూరుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.జర్మనీ ఇంధన విధానంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఎంపీ మైఖేల్ కెల్నర్ ఈ ప్రతిపాదనపై తీవ్రంగా స్పందించారు.“ఇది యూరప్‌కు భారీ మూల్యం చెల్లించేలా చేసే ఒప్పందంగా మారే ప్రమాదం ఉంది. అమెరికన్లు, రష్యన్లు లాభాలను పంచుకుంటారు” అని ఆయన వ్యాఖ్యానించారు.
జర్మనీ అధికార కూటమి నార్డ్ స్ట్రీమ్ పునఃప్రారంభానికి వ్యతిరేకంగా ఉండగా.. దేశంలో ప్రజాదరణ పొందుతున్న ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (AfD) మాత్రం రష్యా గ్యాస్ సరఫరాలను తిరిగి ప్రారంభించాలని కోరుతోంది.దిమిత్రియేవ్ వచ్చే ఏడాది ప్రారంభంలో AfD నాయకత్వంతో సమావేశమై రష్యా గ్యాస్ విక్రయాలను తిరిగి ప్రారంభించే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.
నార్డ్ స్ట్రీమ్ యాజమాన్యమే మరో చిక్కు
పైప్‌లైన్‌ను తిరిగి ప్రారంభించాలన్నా.. దాని యాజమాన్యంలో అమెరికా పెట్టుబడిదారుడిని చేర్చాలన్నా అనేక అడ్డంకులు ఉన్నాయి.నార్డ్ స్ట్రీమ్‌ను నియంత్రించే కంపెనీలో 51 శాతం వాటా రష్యా ప్రభుత్వ ఇంధన దిగ్గజం గాజ్‌ప్రోమ్ చేతిలో ఉంది. మరో 31 శాతం వాటా రెండు జర్మన్ సంస్థల మధ్య ఉంది. మిగిలిన వాటాలు ఫ్రెంచ్, డచ్ సంస్థల వద్ద ఉన్నాయి.గాజ్‌ప్రోమ్ తన వాటాను విక్రయిస్తే.. తమ జర్మన్ ప్రభావాన్ని కొనసాగించేందుకు ప్రస్తుతం ఉన్న రెండు జర్మన్ వాటాదారులు తమ వాటాలను నిలుపుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.
‘ప్రాస్పెరిటీ ఒప్పందాలు’ ..కుష్నర్
మాస్కోలో జరిగిన సమావేశాల తర్వాత కొద్దిరోజులకే కుష్నర్ కీవ్‌లో యూరోపియన్ ప్రతినిధులతో మాట్లాడారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ధరల గురించి చర్చించిన ఆయన.. శాంతిని ప్రోత్సహించేందుకు ‘ప్రాస్పెరిటీ అగ్రిమెంట్స్’ అవసరమని వాదించారు. అలాంటి ఒప్పందాలు శాంతికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు.. భవిష్యత్తుపై నాయకులకు ఆశ చూపుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యా గ్యాస్ ఒప్పందం కుదిరితే క్రెమ్లిన్‌కు ప్రయోజనం కలిగే అవకాశం ఉన్నప్పటికీ.. జర్మనీలో ప్రజాభిప్రాయం చీలిపోయే ప్రమాదం ఉంది.రష్యా ఇంధన సంబంధాలను తిరస్కరిస్తున్న పోలాండ్, బాల్టిక్ దేశాలు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా పోలాండ్ ప్రభుత్వం నార్డ్ స్ట్రీమ్ పునఃప్రారంభానికి గట్టిగా వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం.
లుకోయిల్‌పై కూడా మరో డీల్?
నార్డ్ స్ట్రీమ్‌తో పాటు రష్యా ఇంధన దిగ్గజం లుకోయిల్‌కు చెందిన విదేశీ ఆస్తుల విక్రయంపై కూడా కుష్నర్, దిమిత్రియేవ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.యూరప్, ఇతర ప్రాంతాల్లోని చమురు శుద్ధి కేంద్రాలు, పెట్రోల్ బంకులు తదితర ఆస్తులను విక్రయించే ప్రతిపాదన ఇందులో ఉంది.ఈ ప్రణాళిక ప్రకారం అమెరికా ప్రభుత్వానికి చెందిన DFC, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన పెట్టుబడిదారులతో కూడిన కన్సార్టియం ఈ ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రతిగా అమెరికా అధికారులు సంబంధిత ఆంక్షలను ఎత్తివేసే అంశం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.వైట్‌హౌస్ అధికారి ప్రకారం.. లుకోయిల్ విషయంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, కుష్నర్ కలిసి DFCతో చర్చలు జరిపారు. అమెరికాకు ముందస్తు చెల్లింపు, భవిష్యత్ లాభాల్లో వాటా వచ్చేలా ఒప్పంద రూపకల్పనపై చర్చ జరిగినట్లు ఆయన తెలిపారు. నార్డ్ స్ట్రీమ్ పునఃప్రారంభం, రష్యా గ్యాస్ సరఫరాల పునరుద్ధరణ, లుకోయిల్ ఆస్తుల విక్రయం.. ఇవన్నీ ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రతిపాదనలే. ఆంక్షలు, జర్మనీ–యూరప్ వ్యతిరేకత, ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా అంతర్గత రాజకీయాలు.. ఇలా ఒక్కో అంశం ఈ డీల్స్‌కు అడ్డంకిగా నిలుస్తోంది.యుద్ధానికి ముగింపు పలకడానికి దౌత్యం మాత్రమే కాదు.. వ్యాపార ప్రయోజనాలను కూడా శాంతి ప్రక్రియలో భాగం చేయాలన్న అమెరికా ప్రయత్నం ఇప్పుడు కొత్త చర్చకు తెరతీసింది.
