Russia-Black-Sea-Attack-Cargo-Ships : నల్లసముద్రంలో బీబ‌త్సం Andhra Prabha Top News

Russia-Black-Sea-Attack-Cargo-Ships : నల్లసముద్రంలో బీబ‌త్సం Andhra Prabha Top News

  • రెండు కార్గో నౌకలపై ర‌ష్యా దాడి
  • పోలాండ్‌ తీరంలో రష్యా డ్రోన్‌ కలకలం
  • పశ్చిమ యూరప్‌లో అల‌జ‌డి

(వార్సా, ఆంధ్ర‌ప్ర‌భ ప్ర‌తినిధి)

ఉక్రెయిన్‌పై యుద్ధంలో ర‌ష్యా దూకుడు పెంచింది. నల్లసముద్రం, బాల్టిక్‌ సముద్రం పరిధిలోనూ తన దూకుడును పెంచుతున్నట్లు తాజా పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నల్లసముద్రంలో రెండు కార్గో నౌకలపై రష్యా బలగాలు దాడులు చేసినట్లు రష్యా వార్తా సంస్థ ఇంటర్‌ఫ్యాక్స్‌ సోమవారం వెల్లడించింది. ఇదే సమయంలో పోలాండ్‌ బాల్టిక్‌ సముద్ర తీరంలో రష్యా సైనిక డ్రోన్‌గా భావిస్తున్న ఓ పరికరాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుంది. ఈ పరిణామాలు నాటో కూటమి తూర్పు సరిహద్దు దేశాల్లో కలవరం రేపుతున్నాయి. ముఖ్యంగా డ్రోన్లు తమ గగనతలంలోకి చొరబడుతున్న ఘటనలు పెరుగుతుండటం.. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం పశ్చిమ యూరప్‌ వైపు విస్తరించే అవకాశాలపై ఆందోళనలకు కారణమవుతోంది.

పోలాండ్‌ తీరంలో రష్యా డ్రోన్‌!

పోలాండ్‌ ఉత్తర ప్రాంతంలోని రుసినోవో సముద్రతీరానికి సమీపంలో ఓ డ్రోన్‌ను గుర్తించిన సైన్యం.. దాన్ని స్వాధీనం చేసుకుంది. జరోస్లావియెక్‌ సమీపంలోని బాల్టిక్‌ సముద్ర తీరంలో ఈ డ్రోన్‌ లభ్యమైనట్లు పోలాండ్‌ రక్షణ మంత్రి వ్లాదిస్లావ్‌ కోసినియాక్‌-కామిష్‌ తెలిపారు. “ప్రాథమిక పరిశీలన ప్రకారం.. ఇది రష్యా సైనిక డ్రోన్‌గా కనిపిస్తోంది” అని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. డ్రోన్‌ లభించిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని.. స్వాధీనం చేసుకున్న పరికరాన్ని పరిశీలిస్తున్నాయి.

రైలుపై దాడితో మరింత కలకలం

ఆదివారం పోలాండ్‌–ఉక్రెయిన్‌ సరిహద్దు సమీపంలో ఓ ప్రయాణికుల రైలుపై రష్యా డ్రోన్‌ దాడి చేసినట్లు సమాచారం వెలువడింది. ఈ రైలుమార్గంలో మాజీ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో పాటు పలువురు యూరోపియన్‌ దౌత్యవేత్తలు ప్రయాణించిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగించింది. ఈ దాడిపై నాటో ప్రధాన కార్యదర్శి మార్క్‌ రుట్టే తీవ్రంగా స్పందించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఎంతటి ఒత్తిడిలో ఉన్నారో ఈ ఘటన తెలియజేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు ఈ పరిణామాలను మరింత పెద్ద సైనిక ఘర్షణకు దారితీయకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్‌ పిస్టోరియస్‌ హెచ్చరించారు. ఉక్రెయిన్‌–పోలాండ్‌ సరిహద్దు సమీపంలో రైళ్ల వైపు డ్రోన్లు దూసుకొస్తున్నాయన్న నివేదికలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని.. అదే సమయంలో జర్మనీ, దాని మిత్రదేశాలు అనవసరంగా యుద్ధ తీవ్రతను పెంచే పరిస్థితుల్లోకి నెట్టబడకూడదని అన్నారు.

నల్లసముద్రంలోనూ

మరోవైపు నల్లసముద్రంలో రెండు కార్గో నౌకలపై రష్యా బలగాలు దాడులు చేసినట్లు ఇంటర్‌ఫ్యాక్స్‌ వార్తా సంస్థ తెలిపింది. అయితే ఈ దాడులు ఎప్పుడు, ఎలా జరిగాయి? నౌకలకు ఎంతమేర నష్టం వాటిల్లింది? వాటిలో ఉన్న సిబ్బంది పరిస్థితి ఏమిటన్న దానిపై మాత్రం మరిన్ని వివరాలు వెల్లడించలేదు.

తూర్పు నాటో దేశాల్లో భయం భ‌యం

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఇప్పటికే మూడో ఏడాదిని దాటిన నేపథ్యంలో.. తాజాగా డ్రోన్ల చొరబాట్లు, సముద్ర మార్గాల్లో దాడుల ఘటనలు నాటో తూర్పు సభ్యదేశాలను మరింత అప్రమత్తం చేస్తున్నాయి. ఒకవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతుండగా.. మరోవైపు పోలాండ్‌ వంటి నాటో దేశాల సరిహద్దులకు సమీపంగా డ్రోన్ల కదలికలు కనిపించడం తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. యుద్ధం ఉక్రెయిన్‌ సరిహద్దులకే పరిమితమవుతుందా లేక.. బాల్టిక్‌, నల్లసముద్రాల మీదుగా పశ్చిమ యూరప్‌ గడప దాటుతుందా?తాజా పరిణామాలు ఈ ప్రశ్నలను మరోసారి తెరపైకి తెచ్చాయి.