బస్సుల కోసం రోడ్డుపైనే పరుగులు!
కాలేజీ బస్సుల కోసం రోడ్డుపైనే విద్యార్థుల పరుగులు
ప్రధాన రహదారిపై బస్సుల కోసం వేచి చూస్తున్న విద్యార్థులు
తల్లిదండ్రుల్లో ఆందోళన
ఏలూరు టౌన్, ఆంధ్రప్రభ: విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏలూరు మెయిన్ సెంటర్, ఫైర్‌స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కాలేజీ బస్సులను రోడ్డుపైనే నిలిపివేస్తుండటంతో వాటిని ఎక్కేందుకు విద్యార్థులు ప్రధాన రహదారిపైకి రావాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులను వారి ఇళ్లకు చేర్చేందుకు ఆయా కళాశాలల యాజమాన్యాలు బస్సులను ఏర్పాటు చేశాయి. అయితే బస్సులు నిలిపేందుకు విద్యాసంస్థల వద్ద తగిన పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో వాటిని ఇండోర్ స్టేడియం రోడ్డుపై నిలిపివేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
దీంతో బస్సులు ఎక్కేందుకు వచ్చే విద్యార్థులు రోడ్డుపై నడవాల్సి వస్తోంది. అదే సమయంలో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు వేగంగా సాగుతుండటంతో విద్యార్థుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఏదైనా వాహనం అదుపుతప్పి విద్యార్థులను ఢీకొంటే తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లల భద్రతపై తల్లిదండ్రుల ఆవేదన
పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎంతో వ్యయప్రయాసలతో ప్రముఖ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నామని, వారి రవాణా విషయంలో మాత్రం భద్రతా చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని తల్లిదండ్రులు అంటున్నారు. విద్యార్థులు బస్సుల కోసం ప్రధాన రహదారిపైకి రాకుండా చూడాల్సిన బాధ్యత విద్యాసంస్థల యాజమాన్యాలతో పాటు సంబంధిత అధికారులపై ఉందని పేర్కొంటున్నారు.
అధికారులు వెంటనే స్పందించాలి
విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు వెంటనే స్పందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కాలేజీ ప్రాంగణాల వద్దే బస్సులను నిలిపి, విద్యార్థులు అక్కడి నుంచే సురక్షితంగా బస్సులు ఎక్కేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే సమస్యను గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు, అధికారులు సమన్వయంతో విద్యార్థులకు సురక్షిత రవాణా కల్పించేలా శాశ్వత పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
