పోలవరం జిల్లాలో ‘రన్ ఫర్ యూనిటీ’
రంపచోడవరంలో 5కే పరుగు.. పాల్గొన్న కలెక్టర్ దినేష్‌కుమార్, ఎస్పీ చక్రవర్తి
రంపచోడవరం, ఆంధ్రప్రభ: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివస్, పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరంలో శనివారం ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ కె. దినేష్‌కుమార్, ఎస్పీ కె. చక్రవర్తి జెండా ఊపి 5 కిలోమీటర్ల పరుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడటంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. దేశ సమైక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ పృథ్వీరాజ్, పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది, జూనియర్ కళాశాల విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ సమైక్యత నినాదాలతో రంపచోడవరం వీధులు మార్మోగాయి.
