మహిళా కండక్టర్ మృతితో ఆర్టీసీ అలర్ట్ !
- బస్సు డోర్లు మూశాకే కదలాలి..
- రాష్ట్రవ్యాప్తంగా కొత్త మార్గదర్శకాలు
- ప్రవళిక కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం.. ప్రభుత్వ ఉద్యోగం
మణుగూరు, ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
విధి నిర్వహణలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన మణుగూరు డిపో మహిళా కండక్టర్ ప్రవళిక ఘటనతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) అప్రమత్తమైంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. బస్సు తలుపులు పూర్తిగా మూసిన తర్వాతే బస్సు కదలాలని డ్రైవర్లను ఆదేశించింది. ఇదిలా ఉండగా, తీవ్ర విషాదంలోనూ ప్రవళిక కుటుంబ సభ్యులు ఆమె నేత్రాలను దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
డోర్లు మూశాకే బస్సు ముందుకు..
కండక్టర్ మృతి నేపథ్యంలో ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు సంబంధించి ఆర్టీసీ యాజమాన్యం కీలక చర్యలు చేపట్టింది. బస్సు తలుపులు పూర్తిగా మూసిన తర్వాతే వాహనాన్ని ముందుకు నడపాలని డ్రైవర్లు, కండక్టర్లకు స్పష్టం చేసింది. అన్ని డిపోల్లో బస్సుల తలుపులు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో నిరంతరం తనిఖీ చేయాలని డిప్యూటీ రీజినల్ మేనేజర్లను ఆదేశించింది.
సంస్థ సొంత బస్సులతో పాటు అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ డోర్ల పనితీరును నిశితంగా పరిశీలించాలని సూచించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు సంబంధించిన నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయో లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని నిర్ణయించింది.
రూ.10 లక్షల పరిహారం.. తల్లికి ఉద్యోగం
ప్రవళిక మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అంతేకాకుండా ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
విషాదంలోనూ నేత్రదానం..
కుటుంబ సభ్యురాలిని కోల్పోయిన బాధలోనూ ప్రవళిక కుటుంబం గొప్ప నిర్ణయం తీసుకుంది. పోస్టుమార్టం అనంతరం ఆమె నేత్రాలను దానం చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో ఆమె కార్నియాలు ఇద్దరికి చూపునిచ్చేందుకు ఉపయోగపడనున్నాయి. ప్రవళిక మరణించినా.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపనుంది.
చిల్లర వివాదంతో విషాదం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెం వద్ద గత నెల 25న ఈ ఘటన చోటుచేసుకుంది. మణుగూరు డిపోకు చెందిన మహిళా కండక్టర్ ప్రవళిక విధులు నిర్వహిస్తుండగా చిల్లర విషయంలో ప్రయాణికురాలితో వివాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రయాణికురాలు ఆమెను కదులుతున్న బస్సు నుంచి కిందకు నెట్టివేసినట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో కిందపడిన ప్రవళిక బస్సు చక్రాల కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆమె రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తొలుత స్థానికంగా చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆస్పత్రికి వెళ్లి ప్రవళికను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఆమె కోలుకుంటుందని కుటుంబ సభ్యులు, సహచరులు ఆశించినప్పటికీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచారు.
బుధవారం మణుగూరు డిపో బంద్‌కు పిలుపు
ప్రవళిక మృతికి కారణమైన ప్రయాణికురాలిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం మణుగూరు డిపో బంద్‌కు పిలుపునిచ్చింది. కండక్టర్ మృతి పట్ల ఆర్టీసీ సిబ్బంది, కార్మిక సంఘాల నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
