చికిత్స పొందుతూ ఆర్టీసీ మహిళా కండక్టర్‌ మృతి..

  • చిల్లర వివాదంలో ప్రయాణికురాలు తోసేయడంతో తీవ్ర గాయాలు
  • బస్సు వెనుక చక్రాలు మీదుగా వెళ్లడంతో నుజ్జునుజ్జయిన కాళ్లు
  • నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడి తుదిశ్వాస…

మణుగూరు, ఆంధ్రప్రభ :

చిల్లర విషయంలో తలెత్తిన వివాదం మహిళా ఆర్టీసీ కండక్టర్‌ ప్రాణాలను బలిగొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోకు చెందిన కండక్టర్‌ గుండ్ల ప్రవళిక (30) చికిత్స పొందుతూ మృతి చెందారు. నాలుగు రోజుల క్రితం బస్సులో ప్రయాణికురాలితో జరిగిన వివాదంలో కదులుతున్న బస్సులోంచి కిందపడిన ఆమెపై వెనుక చక్రాలు వెళ్లడంతో రెండు కాళ్లు తీవ్రంగా నలిగిపోయాయి. తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవళిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు.

రూ.90 చిల్లర విషయంలో వివాదం

అక్టోబర్‌ 25న మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మిట్టగూడెం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టికెట్‌ చెల్లింపులో భాగంగా రూ.90 చిల్లర బాకీ విషయంలో ప్రవళికకు ఓ మహిళా ప్రయాణికురాలితో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. కోపంతో ఊగిపోయిన ఒక మహిళా ప్రయాణికురాలు, కదులుతున్న బస్సులోంచి ప్రవళికను బయటకు నెట్టేసింది.

బస్సులోంచి రోడ్డుపై పడిపోయిన ప్రవళికపై నుంచి.. బ‌స్సు వెనుక చక్రాలు వెళ్లడంతో ఆమె రెండు కాళ్లు తీవ్రంగా నలిగిపోయాయి. శరీరంలోని ఇతర భాగాలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలు నిలవలేదు.

ప్రయాణికురాలు అరెస్ట్‌.. కార్మిక సంఘాల దిగ్భ్రాంతి

ఈ ఘటనకు కారణమైన మహిళా ప్రయాణికురాలిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్‌పై జరిగిన ఘటన, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.