కదిరి డిపో మేనేజర్‌పై ఆర్టీసీ ఉద్యోగుల ఆగ్రహం

కదిరి, అక్టోబరు 6 (ఆంధ్రప్రభ): ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జారీ చేసిన ఉద్యోగ భద్రతా సర్క్యులర్‌ 1/2019ను కదిరి డిపోలో అమలు చేయడం లేదని ఆరోపిస్తూ నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు మంగళవారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ‘‘రాష్ట్రంలోని మిగిలిన డిపోల్లో ఉద్యోగ భద్రతా నిబంధనలు అమలవుతుంటే కదిరి డిపోలోనే ఎందుకు అమలు చేయడం లేదు?’’ అంటూ యూనియన్‌ నాయకులు డిపో యాజమాన్యాన్ని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా యూనియన్‌ డిపో కార్యదర్శి బైరిశెట్టి స్వయంగా పూలహారం వేసుకుని నిరాహారదీక్షలో కూర్చున్నారు. డిపో అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులను కదిరి డిపో మేనేజర్‌ పట్టించుకోకుండా ఉద్యోగులపై ఇష్టానుసారంగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగ భద్రతకు సంబంధించిన సర్క్యులర్‌ 1/2019లోని నిబంధనలను యాజమాన్యం తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

యూనియన్‌ నాయకుల వివరాల ప్రకారం.. సర్క్యులర్‌లోని ఐటెం 3.2 ప్రకారం డ్రైవర్‌ ప్రమాదానికి సంబంధించిన కేసుల్లో విచారణలో పాక్షిక బాధ్యత మాత్రమే తేలిన సందర్భంలో ఉద్యోగిని సస్పెండ్‌ చేయకుండా మేజర్‌-1 శిక్షగా పరిగణించి ఒక సంవత్సరం వార్షిక ఇంక్రిమెంట్‌ కోత విధించే విధానం ఉందని తెలిపారు. అయితే కదిరి డిపోలో డ్రైవర్లు భాస్కర్‌రెడ్డి, మదార్‌వలి, యేసన్న, అంజినప్పలను ఉద్యోగాల నుంచి తొలగించారని, దీనివల్ల వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 128 ఆర్టీసీ డిపోలు ఉన్నాయని, వాటిలో 127 డిపోల్లో ఉద్యోగ భద్రతా నిబంధనలు అమలు చేస్తున్నారని, కదిరి డిపోలో మాత్రం వాటిని అమలు చేయడం లేదని యూనియన్‌ నాయకులు ఆరోపించారు. ‘‘ఎండీ స్థాయి నుంచి జారీ చేసిన ఉత్తర్వులకే విలువ లేకపోతే ఉద్యోగులకు భద్రత ఎక్కడ?’’ అని ప్రశ్నించారు. వెంటనే కదిరి డిపోలో ఉద్యోగ భద్రతా సర్క్యులర్‌ 1/2019ను అమలు చేసి, తొలగించిన ఉద్యోగుల విషయంలో న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకాన్ని విజయవంతం చేయడంలో కదిరి డిపో ఉద్యోగులు కీలకంగా పనిచేస్తున్నారని యూనియన్‌ నాయకులు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగులు కృషి చేస్తున్న సమయంలో, మరోవైపు డ్రైవర్ల ఉద్యోగాలపై కఠిన చర్యలు తీసుకోవడం సమంజసం కాదని అన్నారు.

రిలే నిరాహారదీక్షలో డ్రైవర్లు గంగన్న, వేమనారాయణ, శ్రీనివాసులు, గంగిరెడ్డి తదితరులతో పాటు కండక్టర్లు బాష, గురుమోహన్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు. సురేష్‌, లక్ష్మీనారాయణ, సుధాకర్‌, రమేష్‌బాబు, సురేంద్ర, ఓబులేసు, శ్రీనివాసులు, శివశంకర్‌, రమేష్‌నాయుడు తదితరులు దీక్షలకు మద్దతు తెలిపారు. కదిరి డిపోలో ఉద్యోగ భద్రతా సర్క్యులర్‌ అమలు చేసి, ఉద్యోగులపై తీసుకున్న చర్యలను పునఃసమీక్షించి న్యాయం చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని యూనియన్‌ నాయకులు స్పష్టం చేశారు.