Rs.5,116 cash | ఆడపిల్ల జన్మిస్తే రూ.5,116 నగదు బహుమతి

Rs.5,116 cash | ఆడపిల్ల జన్మిస్తే రూ.5,116 నగదు బహుమతి
- ప్రమాణ స్వీకారం రోజే హామీ అమలు చేసిన సర్పంచ్
- మండలంలో 24 గ్రామ పంచాయతీలకు ఆదర్శప్రాయుడుగా నిలిచిన రాజు
Rs.5,116 cash | కమలాపూర్, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ నకిర్త రాజు ఎన్నికల హామీని ప్రమాణ స్వీకారం రోజే అమలు చేసి ప్రత్యేక గుర్తింపు సాధించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ఆడపిల్ల పుడితే ‘ఆడపిల్ల భరోసా కార్డు’ద్వారా 5,116 రూపాయల నగదు అందజేస్తానన హామీ ఇచ్చారు. ఈ నెల మూడు తర్వాత గ్రామంలో అంకిల్ల మౌనిక రాజు అనే దంపతులకు ఆడపిల్ల జన్మించింది.
సోమవారం తన సర్పంచ్ పదవికి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగాసర్పంచ్ రాజు మొదటి సంతకం తర్వాత తాను ఇచ్చిన హామీ అయినటువంటి ఆడపిల్ల భరోసా కార్డు ద్వారా ఆడపిల్ల తల్లిదండ్రులు అంకిళ్ల మౌనిక రాజుకు రూ.5,116 నగదు(Rs.5,116 cash) అందజేశారు. ఎన్నికల హామీలను మాటలకే పరిమితం చేయకుండా అమలు చేసిన సర్పంచ్ నిర్ణయాన్ని గ్రామ ప్రజలు హర్షాతిరేకాలతో స్వాగతించారు. ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించే ఈ ‘ఆడపిల్ల భరోసా’ కార్యక్రమం మహిళా సంక్షేమానికి ఆదర్శంగా నిలుస్తుందని, ఇతర గ్రామాలకు మార్గదర్శకంగా ఉంటుందని గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.
