కల్తీ మాఫియాతోనే డయేరియా

కల్తీ మాఫియాతోనే డయేరియా

నిర్లక్ష్యంతో పోతున్న ప్రజల ప్రాణాలు..
తక్షణ చర్యలు తీసుకొండి
ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కల్తీ మాఫియా విస్తరిస్తుండటంతో పాటు డయేరియా కేసులు పెరుగుతున్నాయంటూ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో భాగంగా బుధవారం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీలో డయేరియా విజృంభిస్తున్నప్పటికీ ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అధికారులను పంపిస్తున్నాం, నమూనాలు సేకరిస్తున్నాం, బ్లీచింగ్ చల్లిస్తున్నాం అనే ప్రకటనలు తప్ప ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం పట్ల నిజమైన బాధ్యత కనిపించడం లేదన్నారు.

వైద్య రంగాన్ని ప్రైవేటు వైపుకు మళ్లించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కల్తీ పాల కారణంగా ఆరుగురు మరణించారని, చిన్నారుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయని తెలిపారు. తురకపాలెం గ్రామంలో 60 మంది మరణించిన ఘటనపై మంత్రి అంతుబట్టని వ్యాధి అని చెప్పడం బాధాకరమన్నారు. గ్రామంలో తాగునీటి సమస్యపై కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని ఆరోపించారు.

వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపినా ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు. మరణించిన వారు ప్రధానంగా ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన పేదలేనని, వారి ప్రాణాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. డ్రైనేజీ లీకేజీ వల్ల కలుషిత నీరు తాగడం కారణంగా డయేరియా వ్యాప్తి చెందిందని అధికారులే చెబుతున్నారని గుర్తుచేశారు. సంక్షేమ హాస్టళ్లలో కూడా కల్తీ ఆహారం కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ద్వారా ఫీవర్ సర్వేలు నిర్వహించేవారని, ఇప్పుడు ఆ వ్యవస్థను బలహీనపరచవద్దని ప్రభుత్వాన్ని కోరారు.

చనిపోయిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకుంటామని చెప్పడం సమంజసం కాదని, సంబంధిత మంత్రులు, అధికారులు బాధిత ప్రాంతాలను సందర్శించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ పాల కారణంగా మరణించిన వారికి రూ.10 లక్షలు, డయేరియా బాధితులకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించడం సరిపోదని, బాధిత కుటుంబాలకు మరింత సహాయం అందించాలని మొండితోక అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.

Leave a Reply