HYD | క్రిప్టోకరెన్సీ పేరుతో రూ.21 లక్షల దోపిడీ..

HYD | క్రిప్టోకరెన్సీ పేరుతో రూ.21 లక్షల దోపిడీ..

బిట్‌కాయిన్‌గా మారుస్తామంటూ మోసం..
బాధితుడిపై పెప్పర్‌ స్ప్రేతో దాడి
నాంపల్లి బజార్‌ఘాట్‌లో ఘటన..
రూ.4 లక్షలు కిందపడటంతో మిగిలిన సొమ్ముతో పరారీ


HYD | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: క్రిప్టోకరెన్సీగా నగదు మార్పిడి చేస్తామంటూ హైదరాబాద్‌లో భారీ దోపిడీకి పాల్పడ్డారు. బిట్‌కాయిన్‌గా మారుస్తామని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.21 లక్షలు అపహరించారు. నాంపల్లి బజార్‌ఘాట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగదు చూపించమని అడిగిన నిందితులు.. బాధితుడు డబ్బులు బయటకు తీయగానే కళ్లలో పెప్పర్‌ స్ప్రే కొట్టి దాడికి దిగారు. అనంతరం నగదుతో పరారయ్యేందుకు ప్రయత్నించారు. బాధితుల ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఎర్రగడ్డ మోతీనగర్‌కు చెందిన అమరేంద్ర బ్యాంకు రుణాల సదుపాయాలు కల్పించే ఫెసిలిటేటర్‌గా పనిచేస్తున్నారు. తన వద్ద ఉన్న రూ.25 లక్షలను క్రిప్టోకరెన్సీగా మార్చాలని జూబ్లీహిల్స్‌కు చెందిన షానవాజ్‌ ఆయనను కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో స్నేహితులు విజయ్‌కుమార్‌, అమర్‌కుమార్‌ల సలహా మేరకు అమరేంద్ర నాంపల్లి బజార్‌ఘాట్‌లోని బినాన్స్‌ వాలెట్‌ కార్యాలయానికి వెళ్లారు.

అక్కడ సుమేర్‌, సయ్యద్‌ పేర్లతో పరిచయమైన ఇద్దరు వ్యక్తులను కలిశారు. రూ.25 లక్షలకు సమానమైన క్రిప్టోకరెన్సీ కావాలని అమరేంద్ర కోరడంతో.. ముందుగా నగదు చూపించాలని వారు అడిగారు.

అమరేంద్ర నగదును చూపించగానే నిందితులు ఒక్కసారిగా ఆయన కళ్లలో పెప్పర్‌ స్ప్రే చల్లి దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆయన వద్ద ఉన్న రూ.25 లక్షలను లాక్కొని అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితులను అడ్డుకునేందుకు విజయ్‌కుమార్‌ ప్రయత్నించారు. దీంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది.

ఈ పెనుగులాటలో నిందితుల చేతుల్లో ఉన్న నగదులో రూ.4 లక్షలు కిందపడిపోయాయి. మిగిలిన రూ.21 లక్షలను తీసుకుని నిందితులు పరారయ్యారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

బాధితుల ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. క్రిప్టోకరెన్సీ మార్పిడి పేరుతో జరిగిన ఈ దోపిడీలో మరెవరైనా ఉన్నారా? నిందితులు బాధితులకు ముందే పరిచయమా? అనే కోణాల్లోనూ విచారణ చేపట్టినట్లు సమాచారం.