టీమ్‌ఇండియాకి రూ.130 కోట్ల డీల్..!
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : టీమ్‌ఇండియా మైదానంలో దూసుకెళ్తుంటే.. వాణిజ్య రంగంలోనూ బీసీసీఐ భారీ ఇన్నింగ్స్ ఆడుతోంది. భారత స్వదేశీ క్రికెట్ సీజన్‌కు క్యాంపా, ఎస్‌బీఐ లైఫ్, చాట్‌జీపీటీలను అసోసియేట్ పార్ట్‌నర్లుగా బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. రెండు సీజన్లకు ఈ భాగస్వామ్యం కుదిరింది. కాగా, వెస్టిండీస్‌తో భారత్ ఆడనున్న స్వదేశీ సిరీస్ (సెప్టెంబర్ 27) నుంచి ప్రారంభమై 2028 మార్చి వరకు కొనసాగనుంది. మూడు భాగస్వామ్యాల మొత్తం విలువ రూ.130 కోట్లకు పైగానే ఉండటం విశేషం. అయితే, గత ఒప్పంద కాలంతో పోలిస్తే ఇది ఏకంగా 44 శాతం పెరుగుదల.
క్రికెట్ కేవలం మైదానానికే పరిమితం కాకుండా వ్యాపార సంస్థలకు భారీ ప్రచార వేదికగా మారిందని బీసీసీఐ పేర్కొంది. కోట్లాది మంది అభిమానులతో అనుసంధానం కావడానికి, వినియోగదారులకు చేరువ కావడానికి భారత క్రికెట్ అందిస్తున్న అవకాశాలను ఈ కొత్త భాగస్వామ్యాలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపింది.
‘భారత హోమ్ సీజన్‌కు భారీ డిమాండ్’
బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ మాట్లాడుతూ.. భారత స్వదేశీ క్రికెట్ సీజన్ దేశంలో అత్యంత విలువైన, డిమాండ్ ఉన్న క్రీడా వేదికల్లో ఒకటని అన్నారు. క్యాంపా, ఎస్‌బీఐ లైఫ్, చాట్‌జీపీటీ భాగస్వామ్యం భారత క్రికెట్ వ్యవస్థపై ప్రముఖ బ్రాండ్లకు ఉన్న నమ్మకాన్ని చాటుతోందని పేర్కొన్నారు. భాగస్వామ్యాల మొత్తం విలువలో 44 శాతం పెరుగుదల రావడం ప్రత్యేకంగా ప్రోత్సాహకరమని మన్హాస్ అన్నారు. మూడు సంస్థలు విభిన్న రంగాలకు చెందినవని, ఒక్కో బ్రాండ్ తనదైన ప్రత్యేకతతో భారత క్రికెట్‌తో కలిసి పనిచేయబోతోందని తెలిపారు. వెస్టిండీస్‌తో మొదలయ్యే తదుపరి స్వదేశీ సిరీస్ నుంచి ఈ కొత్త భాగస్వామ్యాలు అమల్లోకి రానున్నాయి. 2028 మార్చి వరకు సాగే ఈ ఒప్పందం.. టీమ్‌ఇండియా క్రికెట్‌కు వాణిజ్యపరంగా మరో భారీ విజయంగా నిలిచింది.
