క్రిప్టో, పొంజీ స్కీమ్‌ల పేరిట రూ.10 కోట్ల మోసం

ఇద్దరు అంతర్రాష్ట్ర కీలక నిందితులు అరెస్ట్
ఐటీసీ గ్లోబల్ వెబ్ సైట్ సృష్టించి రూ. 10 కోట్లకు పైగా టోకరా..!
తెలుగు రాష్ట్రాల్లో 500 మంది బాధితులు!

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : పొంజీ స్కీమ్, క్రిప్టో కరెన్సీ మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో రెండేళ్లలో డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి సుమారు 500 మంది నుంచి రూ. 10 కోట్లకు పైగా వసూలు చేసిన అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు కీలక నిందితులను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.

ఈ కేసు వివరాలను ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘కాంటెం ఇండియా’ పేరుతో వెబ్‌సైట్ ఓపెన్ చేసి, ఐటీసీ క్రిప్టో కరెన్సీ, పొంజీ స్కీమ్‌లలో పెట్టుబడులు పెడితే రెండేళ్లలో రెండింతలు ఇస్తామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ప్రచారం చేశారు. వందలాది మంది ఉద్యోగులు, వ్యాపారులు, రిటైర్డ్ ఉద్యోగుల నుంచి రూ. 10 కోట్లకు పైగా వసూలు చేశారు. ఆదిలాబాద్‌కు చెందిన బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.

ప్రధాన సూత్రధారులైన కాంటెం ఇండియా ఫౌండర్ డాక్టర్ రత్నరాజు, కో-ఫౌండర్ లాజరస్‌లను పోలీసులు అరెస్టు చేశారు. గోపికృష్ణ, అజీమ్ ఖాన్, గాజుల ప్రమోద్ కుమార్, వేమునూరు సుధీర్ పరారీలో ఉండగా, వారి కోసం గాలిస్తున్నారు. జూమ్ మీటింగ్‌లు, హోటళ్ల సమావేశాల ద్వారా నమ్మించి మోసగించిన ఈ ముఠా నుంచి బాధితుల డబ్బులను రికవరీ చేస్తామని ఎస్పీ తెలిపారు. అనధికార వెబ్‌సైట్లను నమ్మవద్దని, మోసపోతే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, సీఐ బి. సునీల్ కుమార్, ఎస్సైలు అశోక్, సంజయ్ పాల్గొన్నారు.