ఇందిరమ్మ ఇంటికి రూ.10–15 లక్షలు ఇవ్వాలి
మేస్త్రీల కూలీలకే రూ.3–4 లక్షలు ఖర్చవుతున్నాయి
ఇళ్ల మంజూరు జరిగినా డబ్బులు లేక నిర్మాణాలు ప్రారంభించలేకపోతున్నారు
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న రూ.5 లక్షల ఆర్థిక సాయం పెంచాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కోరారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం నిర్మాణ సామగ్రి ధరలు, కూలీల ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో రూ.5 లక్షలతో ఇల్లు నిర్మించుకోవడం లబ్ధిదారులకు కష్టంగా మారిందన్నారు.
ప్రస్తుతం ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే కనీసం రూ.10–15 లక్షలు అవసరమవుతున్నాయని తెలిపారు. ఒక్క మేస్త్రీలు, కూలీల ఖర్చులకే రూ.3–4 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోందని, దీనికి తోడు సిమెంట్, ఇసుక, ఇనుము తదితర నిర్మాణ సామగ్రి ధరలు కూడా పెరిగాయని వివరించారు.
డబ్బులు లేక నిర్మాణాలకు బ్రేక్
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ చాలామంది లబ్ధిదారులు నిర్మాణం ప్రారంభించలేకపోతున్నారని రాజగోపాల్రెడ్డి తెలిపారు. ఆర్థిక స్థోమత లేక కొందరు ఇళ్ల నిర్మాణాన్ని వాయిదా వేస్తున్నారని, మరికొందరు అందుబాటులో ఉన్న డబ్బు సరిపోక బంగారం కుదువపెట్టి ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఇందిరమ్మ ఇళ్ల బడ్జెట్ను పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ఉన్న నిర్మాణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక సాయాన్ని పెంచితేనే లబ్ధిదారులకు పథకం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
