మృతుల కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలి

మృతుల కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలి

ధర్నా చేసిన వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
రోడ్డు విస్తరణ వేగవంతం చేయాలి
ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత వెల్లడి


చేవెళ్ల, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద టిప్పర్ – ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం చేవెళ్ల పట్టణ కేంద్రంలో పీఎంఆర్ మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది.. ఎక్కడికి వెళ్తున్నారు.. వారి కుటుంబ స్థితిగతులు, అందుతున్న చికిత్సపై వాకబు చేశారు.

అనంతరం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చేవెళ్ల బస్సు రోడ్డు ప్రమాదం (Chevella bus road accident) జరిగి 19 మంది మృత్యువాత పడడం, 30మందికి పైగా గాయాలు కావడం ఎంతో విచారకరమని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో మృతిచెందిన, గాయపడ్డ వారంతా నిరుపేదలేనన్నారు. గాయపడ్డ వారికి మరో ఆరు నెలలు చికిత్సలు, విశ్రాంతి అవసరం. వీరికి ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ప్రమాదానికి ప్రాథమిక బాధ్యత వహించాలన్నారు. ఎన్ హెచ్ 163 లో నిర్మాణ లోపాలు ఉన్నాయన్నారు.

ఈ రోడ్డు రెండు వైపులా కుంగిపోయింది. దీనివల్ల వాహనచోదకులు రోడ్డు మధ్యలో నుంచి ప్రయాణించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారి (Hyderabad – Bijapur National Highway) విస్తరణకు నిధులు మంజూరై టెండర్ ప్రక్రియ పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నాయన్నారు. ఎన్జిటిలో మర్రి వృక్షాలను పరిరక్షించాలని పర్యావరణ ప్రేమికులు కేసు వేశారు. ఈ కేసును ఉపసంహరింపజేయడంలో ఇన్నాళ్లు గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు అలసత్వం వహించాయన్నారు. హెచ్ 163 విస్తరణను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

రోడ్డు ప్రమాద బాధితులు ప్రజలు రోడ్డు విస్తరణ చేపట్టాలని తాండూరు (Tandoor) లో ధర్నా చేశారు. వీరి బాధను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. కానీ ధర్నా చేసిన 30మందిపై కేసులు నమోదు చేయడం పట్ల ఆమె మండిపడ్డారు. నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం ఆమె బస్సు ప్రమాద సంఘటనా స్థలం కు వెళ్లి పరిశీలించారు.ఈ సందర్షణలో గ్రంధాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, ముస్లిం మైనార్టీ సెల్ జాగృతి రాష్ట్ర అధ్యక్షులు ముస్తఫా తదితరులు ఉన్నారు.

Leave a Reply