RRB NTPC Recruitment 2026 |ఇంటర్ అర్హతతో దరఖాస్తుకు అవకాశం!
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (ఎన్‌టీపీసీ) అండర్‌గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 1,688 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు అవకావం ఉంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్ 15న ప్రారంభమైంది. నవంబర్ 13వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు ఇవే..
ఆర్ఆర్బీ ఎన్‌టీపీసీ అండర్‌గ్రాడ్యుయేట్ నియామకాల్లో భాగంగా నాలుగు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు.
- కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 700 పోస్టులు
- జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 600 పోస్టులు
- అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 200 పోస్టులు
- ట్రైన్స్ క్లర్క్: 188 పోస్టులు
మొత్తంగా 1,688 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు.. వయోపరిమితి
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. 2027 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అర్హులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. పోస్టులవారీగా నిర్దేశించిన అర్హతలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ పోస్టులకు నెలకు రూ.19,900 ప్రాథమిక వేతనం ఉంటుంది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టుకు నెలకు రూ.21,700 ప్రారంభ వేతనంగా నిర్ణయించారు. ఇతర అలవెన్సులు నిబంధనల ప్రకారం వర్తిస్తాయి.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపికలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT-1, CBT-2), ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు ఉంటాయి. పరీక్షల విధానం, మార్కులు, నెగెటివ్ మార్కింగ్, పోస్టులవారీగా వర్తించే నిబంధనలను అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌లో తెలుసుకోవాలి.
దరఖాస్తు వివరాలు..
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.500గా, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు తదితర అర్హ వర్గాలకు రూ.250గా నిర్ణయించారు. నిబంధనలకు అనుగుణంగా పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఫీజులో కొంత మొత్తం తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. వర్తించే నిబంధనలను నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.
- దరఖాస్తుల ప్రారంభం: అక్టోబర్ 15, 2026
- దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 13, 2026
- ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: నవంబర్ 15, 2026
- దరఖాస్తుల్లో మార్పులకు అవకాశం: నవంబర్ 16 నుంచి 25, 2026 వరకు.
అర్హత ఉన్న అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్ లేదా దరఖాస్తుల పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
