మురసు తుఫాన్ దెబ్బకు రోడ్లు ధ్వంసం
- రహదారుల పునరుద్ధరణకు రూ.143 కోట్ల అంచనా!
- రాష్ట్రవ్యాప్తంగా 162.841 కి.మీ. మేర దెబ్బతిన్న రహదారులు..
- నేలకూలిన 201 చెట్ల తొలగింపు పూర్తి.. 73 ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం
- 34 చోట్ల రాకపోకల పునరుద్ధరణ.. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశం
నంద్యాల, నవంబర్ 4 (ఆంధ్రప్రభ ప్రతినిధి): మురసు తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజలకు రవాణా ఇబ్బందులు కలగకుండా రహదారులపై పడిపోయిన చెట్ల తొలగింపు, ట్రాఫిక్ పునరుద్ధరణ, దెబ్బతిన్న ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మతుల పనులను వేగవంతం చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన జిల్లా రహదారులు, రాష్ట్ర రహదారులు కలిపి మొత్తం 162.841 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయని బుధవారం వెల్లడించారు.
162.841 కి.మీ. మేర రహదారులకు నష్టం
తుఫాన్ కారణంగా రహదారుల ఉపరితలాలు దెబ్బతినడంతోపాటు పలు ప్రాంతాల్లో నిర్మాణాలకు నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు. రెండు చోట్ల స్కౌర్స్, నాలుగు చోట్ల రోడ్డు కోతలు, ఐదు చోట్ల కల్వర్టులకు సంబంధించిన పనులు దెబ్బతిన్నట్లు వివరించారు. ఆయా ప్రాంతాల్లో రహదారుల పరిస్థితిని అధికారులు పరిశీలిస్తూ మరమ్మతుల చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు.
201 చెట్ల తొలగింపు పూర్తి
తుఫాన్ ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో 201 చెట్లు నేలకూలగా, అధికారులు తక్షణమే స్పందించి వాటన్నింటినీ తొలగించినట్లు మంత్రి తెలిపారు. చెట్లు కూలిపోవడం, రహదారులు దెబ్బతినడం తదితర కారణాలతో 73 ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందన్నారు. ఇప్పటికే 34 చోట్ల రాకపోకలను పునరుద్ధరించామని, మిగిలిన ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
నెల్లూరు జిల్లాలో అత్యధిక నష్టం
జిల్లాల వారీగా రహదారుల నష్టాన్ని పరిశీలిస్తే.. ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలో 66.600 కిలోమీటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో 52.683 కిలోమీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 38.572 కిలోమీటర్లు, ప్రకాశం జిల్లాలో 3.600 కిలోమీటర్లు, పల్నాడు జిల్లాలో 1.386 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు మంత్రి వెల్లడించారు.
మరమ్మతులకు రూ.143.36 కోట్లు
దెబ్బతిన్న రహదారులకు తాత్కాలిక, శాశ్వత మరమ్మతులు చేపట్టేందుకు మొత్తం రూ.143.36 కోట్ల నిధులు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి తెలిపారు. ఇందులో తాత్కాలిక మరమ్మతులకు రూ.16.66 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.126.70 కోట్లు అవసరమని వివరించారు. నిధుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
అధికారులకు మంత్రి ఆదేశాలు
తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ఆర్ అండ్ బీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. దెబ్బతిన్న రహదారుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రమాదకర ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మరమ్మతుల పనుల్లో జాప్యం జరగకుండా అవసరమైన యంత్రాలు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలకు రవాణా సౌకర్యాలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించే వరకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.
