రహదారులకు మరమ్మతులు చేపట్టాలి..
భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగు చేయాలి..
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
బాసర, ఆంధ్రప్రభ: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం బాసర మండలం బిద్రెల్లి సమీపంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న అంతర్రాష్ట్ర రహదారిని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్లు ఏ మేరకు దెబ్బతిన్నాయనే వివరాలను రోడ్లు, భవనాల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
దెబ్బతిన్న రహదారులకు అవసరమైన మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రహదారులపై అవసరమైన సూచిక బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా రహదారులపై ఏర్పడిన గుంతలు, ఇతర సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఈఈ ఆర్‌అండ్‌బీ సుభాష్, తహసీల్దార్ పవన్‌చంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
