శంకర్‌పల్లి (రంగారెడ్డి జిల్లా) ఆంధ్రప్రభ : శంకర్‌పల్లి మండలం హుస్సేన్‌పూర్‌ వద్ద భారీ దారి దోపిడీ జరిగింది. శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్‌ గౌడ్‌ అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌కు చెందిన రాకేష్‌ అగర్వాల్‌ తన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన రూ.40 లక్షలను వికారాబాద్‌ వెళ్లి తన కస్టమర్‌ దగ్గర నుంచి తీసుకురావాల్సిందిగా తన వద్ద పనిచేసే సాయిబాబా, మణి అనే వ్యక్తులను కారులో పంపారు. వారు డబ్బులను తీసుకొని కారులో నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు.

మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో శంకర్‌పల్లి మండలం పరిధిలోని హుస్సేన్‌పూర్‌ శివారులో వారి కారును అనుసరిస్తూ నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించారు. హుస్సేన్‌పూర్‌ శివారులో నిర్మానుషమైన ప్రాంతంలో వాహనాన్ని అడ్డగించారు.

ముగ్గురు వ్యక్తులు మాస్క్‌ ధరించి డ్రైవింగ్‌ చేస్తున్న మణి కళ్లలో కారం చల్లి వెనుక సీటులో కూర్చున్న సాయిబాబాపై దాడి చేశారు. వారి దగ్గర ఉన్న రూ.40 లక్షల బ్యాగ్‌ను దోపిడీ చేశారు.

అయితే అలా పారిపోతున్న క్రమంలో నాలుగు కిలో మీటర్లు దాటిన తర్వాత కొత్తపల్లి గ్రామ శివారులో నేరస్తుల కారు అదుపు తప్పి పక్కనే ఉన్న కల్వర్టుకు ఢీ కొట్టి బోల్తా పడింది. ప్రమాదానికి గురైన కారులో నుంచి వారు బయటకు వచ్చి, కారును వదిలి డబ్బు తీసుకొని పారిపోయారు. కారు బోల్తా పడిన శబ్దం రావడంతో చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో శంకర్‌పల్లి పోలీసులు, నార్సింగ్‌ ఏసీపీ రమణ గౌడ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

దారిదోపిడీ చేసిన నిందితుల కారు ప్రమాదానికి గురైన విషయాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో విచారణ ప్రారంభించారు. క్లూస్‌ టీమ్‌ వచ్చి ఫింగర్‌ ప్రింట్స్‌ తీసుకున్నారు.

నిందితులను పట్టుకోవడానికి సీసీఎస్‌, ఎస్‌ఓటీ నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. బోల్తా పడిన కారు నుంచి కొంత నగదు, వారికి సంబంధించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. పథకం ప్రకారం దోపిడీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Leave a Reply