బతుకమ్మ పండుగకు రహదారి సుందరీకరణ

  • రైల్వే స్టేషన్‌ నుంచి మార్కెట్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా చెట్ల తొలగింపు
  • జేసీబీతో పనులు చేపట్టిన 5వ వార్డు కౌన్సిలర్‌ చల్లా రమ్య రఘురెడ్డి

స్టేషన్‌ ఘన్‌పూర్‌, ఆంధ్రప్రభ : బతుకమ్మ పండుగను పురస్కరించుకుని స్టేషన్‌ ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో శనివారం రహదారి పరిసరాల శుభ్రత పనులు చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా రైల్వే స్టేషన్‌ నుంచి మార్కెట్‌ వరకు రహదారికి ఇరువైపులా పెరిగిన చెట్ల కొమ్మలను, రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న కొమ్మలను జేసీబీ సహాయంతో తొలగించారు.

5వ వార్డు కౌన్సిలర్‌ చల్లా రమ్య రఘురెడ్డి ఆధ్వర్యంలో ఈ పనులు నిర్వహించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలు, మహిళలు అధికంగా రాకపోకలు సాగించే ప్రధాన మార్గంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రహదారి పరిసరాలను శుభ్రం చేస్తున్నట్లు కౌన్సిలర్‌ తెలిపారు. పండుగ సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన పారిశుధ్య చర్యలను ముందుగానే చేపడుతున్నట్లు పేర్కొన్నారు.