ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

బ్లాక్‌ స్పాట్‌ల వద్ద తాత్కాలిక బారికేడ్లు ఏర్పాటు: సీఐ బ్రహ్మయ్య

శావల్యాపురం, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రూరల్‌ సీఐ బొప్పన బ్రహ్మయ్య తెలిపారు. మండలంలోని కనమర్లపూడి సమీపంలో గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై ఇటీవల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్‌లుగా గుర్తించారు. ప్రమాదాల నియంత్రణలో భాగంగా వాహనాల వేగాన్ని తగ్గించేందుకు పెయింట్‌ చేసిన టైర్లకు రేడియం స్టిక్కర్లు అంటించి తాత్కాలిక బారికేడ్లు ఏర్పాటు చేశారు. గురువారం సీఐ బ్లాక్‌ స్పాట్‌లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరగడంతో పాటు మితిమీరిన వేగం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించడం ద్వారా కొంతమేర ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మోర్ల వెంకటేష్‌బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.