stock market | చమురు ధరల పెరుగుదలతో మార్కెట్లపై ఒత్తిడి…
stock market | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, అంతర్జాతీయంగా చమురు ధరలు ఎగబాకడం, అమెరికా వడ్డీ రేట్లపై ఆందోళనలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపించాయి. దీంతో బుధవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. వరుసగా మూడో రోజు మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి.
ఐటీ, రియాల్టీ, ఆటో రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో సూచీలు దిగజారాయి. సెన్సెక్స్ ఉదయం 76,471.32 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగిన సూచీ ఒక దశలో 700 పాయింట్లకు పైగా పడిపోయింది. ఇంట్రాడేలో 76,135.72 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది.
చివరికి సెన్సెక్స్ 373.93 పాయింట్లు నష్టపోయి 76,570.35 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 141.35 పాయింట్లు కోల్పోయి 23,914.45 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 షేర్లలో ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌సీఎల్, బీఈఎల్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలను చవిచూశాయి. మరోవైపు అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, టైటాన్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్లలోనూ ప్రతికూల పరిస్థితులు కనిపించాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 95.09 డాలర్ల వద్ద కొనసాగగా, బంగారం ఔన్స్ ధర 4,303.19 డాలర్ల వద్ద ట్రేడైంది. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, జపాన్, షాంఘై, హాంకాంగ్ సూచీలు కూడా నష్టాల్లో ముగిశాయి.
