ఆర్‌జీయూకేటీలో ఆఫ్‌లైన్‌ తరగతులకు షెడ్యూల్‌

అక్టోబర్‌ 30న ఇంజనీరింగ్‌ నాలుగో సంవత్సరం విద్యార్థులు

నవంబర్‌ 1న పీయూసీ మొదటి సంవత్సరం..
3న రెండో సంవత్సరం విద్యార్థులు

బాసర, ఆంధ్రప్రభ : ఆర్‌జీయూకేటీ బాసరలో ఆఫ్‌లైన్‌ తరగతుల పునఃప్రారంభానికి సంబంధించి గతంలో ప్రకటించిన తేదీలను సవరిస్తూ యూనివర్సిటీ అకడమిక్‌ డీన్‌ పేరిట మంగళవారం సర్క్యులర్‌ జారీ చేశారు. యూనివర్సిటీ షెడ్యూల్‌ ప్రకారం ఇంజనీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అక్టోబర్‌ 30న, పీయూసీ మొదటి సంవత్సరం విద్యార్థులు నవంబర్‌ 1న, పీయూసీ రెండో సంవత్సరం విద్యార్థులు నవంబర్‌ 3న క్యాంపస్‌కు చేరుకోవాలని సూచించారు.

ఇంజనీరింగ్‌ నాలుగో సంవత్సరం విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌ కార్యక్రమాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌ మొదటి, రెండో, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు యూనివర్సిటీకి చేరుకోవాల్సిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.