Revanth Reddy Sircilla Speech |బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
- గడీల పాలన కావాలా… ప్రజాపాలన కావాలా
- నేత కార్మికులకు రూ.1531 కోట్లు ఇచ్చాము
- వేములవాడ శివయ్యకు శట గోపం
- కేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల ఆస్తులు
- బతుకమ్మ చీరల్లోనూ కమిషన్
- త్వరలో ఎమ్మెల్సీగా పద్మశాలి బిడ్డ
- సిరిసిల్లలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రి పదవి
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సిరిసిల్ల, ఆంధ్రప్రభ: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేశారు. పదేళ్ల పాలనలో సిరిసిల్లలో నేత కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపించారు. సిరిసిల్లను గత పాలనలో ‘ఉరిసిల్ల’గా మార్చారని వ్యాఖ్యానించారు.
ఆరుసార్లు కేటీఆర్‌ను ఎమ్మెల్యేగా గెలిపించిన నేతన్నల సమస్యలు పరిష్కరించలేకపోయారని సీఎం అన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన నేత కార్మికులు మృతి చెందిన సందర్భాల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మృతదేహాలను స్వస్థలాలకు తరలించడంతో పాటు ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు.
నేత కార్మికులకు రూ.1,531 కోట్లు ఇచ్చాం: సీఎం
గత ప్రభుత్వం పదేళ్లలో నేత కార్మికులకు రూ.2,234 కోట్లు ఇచ్చిందని, తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలో రూ.1,531 కోట్లు అందించిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం వదిలిన రూ.350 కోట్ల బకాయిలను చెల్లించామని తెలిపారు.వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని సీఎం విమర్శించారు. భద్రాచలం ఆలయానికి సంబంధించి కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతల ఆస్తులపై వ్యాఖ్యలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై సీఎం పలు ఆరోపణలు చేశారు. రాష్ట్ర సాధన తర్వాత ఆ కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టిందని వ్యాఖ్యానించారు. సంబంధిత నేతల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తానని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ విమర్శలు చేశారు.గతంలో గజ్వేల్‌లో బీఆర్ఎస్ను ఓడించామని, వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలోనూ మార్పు తీసుకొస్తామని సీఎం వ్యాఖ్యానించారు. సిరిసిల్ల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ప్రభుత్వ పథకాలను వివరించిన సీఎం
తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సీఎం ప్రస్తావించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ఆర్థిక భరోసా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు, యువతకు ఉద్యోగాల కల్పన వంటి అంశాలను వివరించారు.
పద్మశాలి బిడ్డకు ఎమ్మెల్సీ అవకాశం: సీఎం
రాబోయే రోజుల్లో పద్మశాలి వర్గానికి చెందిన వ్యక్తికి శాసన మండలి అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని పేర్కొన్నారు.గత ప్రభుత్వంలో కొందరికే పదవులు దక్కాయని సీఎం విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ, సామాజిక వర్గాలకు చెందిన పలువురికి పదవులు దక్కాయని తెలిపారు.

