హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) నిన్న నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించారు. కొల్లాపూర్ (Kolhapur) నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ (Young India School) కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) ఘాటుగా స్పందించారు.
ఎక్స్ వేదికగా రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ… రేవంత్ ప్రకటన పార్టీ విధానాలకు విరుద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ (Congress party) లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సహించరన్నారు. రాజగోపాల్ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవిని ఆశించి రాజగోపాల్ రెడ్డి భంగపడ్డారు. ఈ క్రమంలో ఆయన తొలిసారి ధిక్కారస్వరం వినిపించినట్టయింది.