Revanth Reddy | ‘సైమన్ గో బ్యాక్’ తరహాలో ‘ఎస్‌ఐఆర్ గో బ్యాక్’ ఉద్యమం : సీఎం రేవంత్
- రాహుల్ గాంధీ అరెస్టుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం
- ఢిల్లీలో రాహుల్‌కు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన సీఎం
- సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్
- రాహుల్ నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తామన్న రేవంత్
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఓటు హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఢిల్లీలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ‘ఓటు బచావో–దేశ్ బచావో’ నిరసనలో భాగంగా రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రాహుల్‌కు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న సమయంలో రేవంత్ రెడ్డిని కూడా ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.
బారాఖంబా పోలీస్ స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. “ఎస్‌ఐఆర్ రద్దు చేయాలి.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి”అని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. “వందేళ్ల క్రితం సైమన్ గో బ్యాక్ ఉద్యమం నడిచింది. ఇప్పుడు ఎస్‌ఐఆర్ గో బ్యాక్ ఉద్యమం సాగుతోంది” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకోవడం ద్వారా కేంద్రంలోని మోదీ, అమిత్ షాల అసహనం బయటపడిందని ఆయన ఆరోపించారు.
ఇప్పటివరకు ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకున్నారని, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కోట్లాది మంది ఓటర్ల పేర్లు తొలగించారని ఆయన విమర్శించారు. అరెస్టులు, నిర్బంధాలు, పోలీసుల చర్యలు తమ పోరాటాన్ని ఆపలేవు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
