వెయ్యి రోజుల్లో రూ.4.5 లక్షల కోట్ల అప్పు

కాంగ్రెస్‌ హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు..
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఆరోపణ

చెన్నూర్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెయ్యి రోజుల్లో రూ.4.5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చెన్నూర్‌ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు.

బాల్క సుమన్‌ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం నుంచి పాత బస్టాండ్‌లోని అంబేద్కర్‌ చౌక్‌ వరకు నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్‌ చౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో బాల్క సుమన్‌ మాట్లాడారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 426 హామీలు, 13 డిక్లరేషన్లలో వెయ్యి రోజులు పూర్తయినా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు సెప్టెంబరు 8 వరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తామని బాల్క సుమన్‌ పేర్కొన్నారు.