Revanth Reddy | గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం పరిశీలన
Revanth Reddy | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” కోసం భారీ ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి ప్రాంగణాన్ని పరిశీలించారు. ఆయనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, జయవీర్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ ప్రత్యేక అధికారి శంశాంక్ ఉన్నారు. తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా నిలబెట్టాలని లక్ష్యంగా ఈ సమ్మిట్ ఏర్పాటు చేసినట్టు సీఎం వెల్లడించారు.
మొదట ఏరియల్ వ్యూ ద్వారా మొత్తం సమ్మిట్ (Summit) ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ప్రతి హాల్, సమావేశాల కోసం ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ జోన్లు, స్టాళ్లు, ఎగ్జిబిషన్ హాళ్లను పర్యవేక్షించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌తో పాటు వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులపై ప్రదర్శించనున్న డిజిటల్ స్క్రీనింగ్‌ను కూడా వీక్షించారు. ప్రాంగణానికి ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ తల్లి విగ్రహంను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశ విదేశాల నుండి కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పరిశ్రమల ప్రముఖులు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు హాజరవుతున్నందున స్వాగత ఏర్పాట్లు, వసతి సౌకర్యాలు, వాహన రాకపోకలు, సీటింగ్ ప్లాన్, ఫైర్ సేఫ్టీ, ఇంటర్నెట్ (internet) సౌకర్యాలు లాంటి ప్రతి అంశంలో పూర్తి నాణ్యత, భద్రత పాటించాలని సీఎం అధికారులకు సూచించారు. ఏర్పాట్ల పురోగతిపై విభాగాల వారీగా వివరణలు స్వీకరించారు. సుమారు గంటకు పైగా కొనసాగిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు జారీ చేశారు.

