- శాంతి భద్రతలపై బీఆర్ఎస్ అసత్య ప్రచారం
- వాళ్ల పాలనలో దిశ ఘటన
- వామనరావు దంపతుల దారుణహత్య
- ఈ కేసులను పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం
- రాష్ట్రానికి పెట్టబడులు రాకుండా బీఆర్ఎస్ కుట్ర
- అవాస్తవాలను ప్రచారం చేస్తున్న విపక్షం
హైదరాబాద్: ఆన్ లైన్ బెట్టింగ్ అనేది అంతర్జాతీయ నేరంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఆన్ లైన్ బెట్టింగ్, రమ్మీ పట్ల కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. శాంతిభద్రతల అంశంపై శాసనసభలో ఆయన మాట్లాడుతూ… ఆన్ లైన్ బెట్టింగ్ నిరోధానికి, నిషేధించేందుకు సిట్ వేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇలాంటి కేసుల్లో పడే శిక్షలను సైతం సవరించుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు.
బీఆర్ఎస్ వన్నీ అసత్యాలే..
రాష్ట్రంలోకి పెటుబడులు రాకుండా బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేస్తున్నదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ విషప్రచారం చేస్తుందంటూ విమర్శించారు.. గత కేసీఆర్ పాలనలో దిశ ఘటన జరిగిందని, వామనరావు దంపతులను నడిరోడ్డుపై నరికి హత్య చేశారని గుర్తు చేశారు. ఈ కేసుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ఎంఎంటీఎస్ లో ఘటన జరిగిన వెంటనే తాము స్పందించామన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. భాదితురాలికి ప్రభుత్వం అండగా నిలబడిందన్నారు. మెరుగైన వైద్య సాయం అందిస్తున్నామన్నారు. తమ పాలనలోనే శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు.