లండన్ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం

రేపు ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్న రేవంత్
షెడ్యూల్ ప్రకారం బోస్టన్ వెళ్లాల్సి ఉండగా మారిన ప్రయాణ ప్రణాళిక

హైదరాబాద్, ఆంధ్రప్రభ: లండన్ పర్యటనను ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంతో, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌లో మార్పులు చేసుకుని నేరుగా హైదరాబాద్‌కు బయలుదేరినట్లు ఆయన తెలిపారు. రేపు ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన హైదరాబాద్ చేరుకోనున్నట్లు సమాచారం.

లండన్‌లో గత మూడు రోజులుగా తనకు లభించిన మద్దతుపై రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు పార్టీ నాయకులు, దేశవ్యాప్తంగా తనకు మద్దతు తెలిపిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.

లండన్‌లో ముందుగా నిర్ణయించిన సమావేశాలు, కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత అసలు షెడ్యూల్ ప్రకారం బోస్టన్‌కు వెళ్లాల్సి ఉన్నప్పటికీ, విదేశాంగ శాఖ నుంచి అమెరికా పర్యటనకు అనుమతి లభించకపోవడంతో హైదరాబాద్‌కు తిరిగి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

‘రాజకీయ కారణాలతోనే అనుమతి నిరాకరించారు’

అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలను హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత వెల్లడిస్తానని తెలిపారు.

లండన్ పర్యటనలో జరిగిన సమావేశాలు, అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ, తదనంతర పరిణామాలపై స్వదేశానికి చేరుకున్న తర్వాత మాట్లాడతానని సీఎం స్పష్టం చేశారు. దీంతో రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.