మరమ్మతులతో తాగునీటి సరఫరా పునరుద్ధరణ

మరమ్మతులతో తాగునీటి సరఫరా పునరుద్ధరణ
- కౌన్సిలర్ చొరవతో మరమ్మతులు,
- నీటిని వృథా చేయొద్దని ప్రజలకు సూచన
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట రూరల్ పరిధిలోని మగ్దుంపురంలోని, ముగ్ధం పురం తండాలోని 11వ, 12వ వార్డుల ప్రజలు గత కొద్ది రోజులుగా తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొన్నారు. స్థానిక రైతు కొండ్రెడ్డి శ్రీనివాసరెడ్డి తన వ్యవసాయ భూమిలో కోళ్ల ఫారం నిర్మాణానికి పునాదులు తీయడంతో, అక్కడ గతంలో ఏర్పాటు చేసిన నల్లాల బావి నుండి మంచినీటి ట్యాంకు వరకు వెళ్లే పైప్‌లైన్ పలు చోట్ల దెబ్బతినడం వల్ల ఈ సమస్య తలెత్తింది.
దీంతో గత 20 రోజులుగా వార్డుల ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ. విషయం తెలుసుకున్న 11వ, 12వ వార్డు కౌన్సిలర్ చీకటి స్వరూప ఓదయ్య గౌడ్ వెంటనే స్పందించి మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి గత 5–6 రోజులుగా దెబ్బతిన్న పైప్‌లైన్‌ను మరమ్మతు చేయించారు.

అలాగే ఎస్సీ కాలనీలో పనిచేయకుండా ఉన్న పాత బోరును మరమ్మతు చేయించి తిరిగి ప్రజలకు ఉపయోగపడేలా చేశారు. అదే విధంగా బీసీ కాలనీలోని బోర్‌ను కూడా రిపేర్ చేసి తాగునీటి సరఫరాకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా కొంతమంది ఇళ్ల వద్ద నల్లాలకు మోటర్లు అమర్చి అక్రమంగా నీటిని తీసుకుంటున్నారని సమాచారం అందడంతో, అది సరైన విధానం కాదని వారిని కౌన్సిలర్ హెచ్చరించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ చీకటి సరూప ఓదయ్య గౌడ్ మాట్లాడుతూ వేసవి కాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజలు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని సూచించారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన తాగునీటి పైప్‌లైన్లు, ఇతర సౌకర్యాలకు ఎటువంటి హాని కలిగించకుండా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు.
గ్రామానికి సంబంధించిన ప్రజా సౌకర్యాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన తెలిపారు. ప్రజల సహకారంతోనే ఇలాంటి సమస్యలను నివారించి గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
